The Vote ఓటు వజ్రాయుధం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:17 AM
The Vote Is a Powerful Weapon ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం. ప్రభుత్వాలు, పాలకులను మార్పు చేసే శక్తి దానికుంది. అటువంటి విలువైన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. అర్హులైన వారంతా ఓటరుగా నమోదు కావాల్సి అవసరం కూడా ఎంతైనా ఉంది.
ఓటు హక్కే కాదు.. బాధ్యత కూడా..
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
సాలూరు రూరల్/సీతంపేట రూరల్/పాలకొండ, జనవరి24(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ఓటు హక్కు వజ్రాయుధంతో సమానం. ప్రభుత్వాలు, పాలకులను మార్పు చేసే శక్తి దానికుంది. అటువంటి విలువైన ఓటును వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. అర్హులైన వారంతా ఓటరుగా నమోదు కావాల్సి అవసరం కూడా ఎంతైనా ఉంది. 1950లో భారత ఎన్నికల సంఘం స్థాపించిన రోజును గుర్తుచేసుకుంటూ ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను భాగస్వామ్యం చేయడం, ఓటింగ్ ప్రాముఖ్యత తెలియజేయడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. జిల్లాలో సుమారు 7.83 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే గిరిశిఖర గ్రామాలకు పూర్తిస్థాయిలో రహదారి, రవాణా సౌకర్యాలు లేక ఇప్పటికీ ఎంతోమంది ఓటుకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు నిరక్షరాస్యత, అమాయకత్వంతో అర్హులు కూడా ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ఇకపోతే కొండ దిగువ ప్రాంతంలో నివసిస్తున్న గిరిపుత్రులు పూర్వం రోజుల్లో ఓటు ఎలా వినియోగించుకునేవారో వారి మాటల్లోనే తెలుసుకుందాం..
నేడు జిల్లావాప్తంగా వేడుకలు: కలెక్టర్
పార్వతీపురం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు విద్యార్థులు, యువత, అధికారులతో పార్వతీపురంలో భారీ అవగాహనా ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సమావేశం నిర్వహి స్తామన్నారు. ఈ సందర్భంగా నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేస్తామని వెల్లడించారు.
ఓటు అమూల్యం
1967 నుంచి ఓటు వేస్తున్నా. ఓటు అమూల్యం. ఓటు వేయడానికి అందరూ ముందుకు రావాలి. అప్పట్లో ఎన్నికలు సందడిగా ఉండేవి. అప్పుడు పోటీ చేసిన వాళ్లు సైతం స్నేహపూర్వకంగా ఉండేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఓటర్లును సైతం విభజిస్తున్నారు. ఓటు అడిగిన తీరులో మార్పు గమనిస్తున్నాం. గెలిచినోళ్లు అందర్నీ సమానంగా చూడాలి.
- కోరాడ బోడినాయుడు, గడివలస
==========================
తీరు మారింది
ఎన్నికల తీరు మారింది. ప్రస్తుత ఎన్నికల్లో కుతంత్రం ఎక్కువైంది. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నాడు స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు జరిగేవి. పోటీ చేసిన వారి మధ్య కక్షలు ఉండేవి కాదు. నాడు బ్యాలెట్ల లెక్కింపునకు దాదాపు రెండు రోజుల సమయం పట్టేది. ఈవీఎంలు రావడంతో ఫలితాలు తొందరగానే తెలుస్తున్నాయి. 1972లో తొలి ఓటు వేశాను. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలి.
- నులకల సోములు, సాలూరు
================================
మెరుగ్గా ఎన్నికల నిర్వహణ
మన ఎన్నికల నిర్వహణ బాగుంది. ఎప్పుడూ ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. గత ఎన్నికల సమయంలో ప్రలోభాలు పెట్టేవారు కాదు. ఇప్పుడు ఓటు వేయడానికి ఆశ చూపుతున్నారు. మంచోళ్లు ఎవరనిపిస్తే వారికి నిజాయితీగా ఓటు వేయాలి.
- మజ్జి తవిటయ్య , కూనంబందవలస
================================
వేలిముద్రతో...
నాకు ప్రస్తుతం 91 ఏళ్లు. 22వ ఏట మొదటిసారి ఓటుహక్కును వినియోగించుకున్నా. అప్పట్లో సోమగండి నుంచి సీతంపేట వరకు నడుచుకుని వెళ్లి పోలింగ్ బూత్‌లో ఓటుహక్కు వినియోగిం చుకున్నా. ఓటు కోసం అప్పట్లో ఇంటింటికీ వచ్చి స్టాంప్‌లు వేసిన రశీదులు అందించే వారు. వాటిని తీసుకొని పోలింగ్ బూత్‌కు వెళ్లి .. మాకు నచ్చిన అభ్యర్థి పేరుపై వేలిముద్ర ద్వారా ఓటువేసే వాళ్లం. నేడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం మా గ్రామంలోనే పోలింగ్‌బూత్ ఉంది. ఏడాది కిందట జరిగిన ఎన్నికల్లో మిషన్ నొక్కి ఓటు వేశశం. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఓటు వేయడం చాలా సులువు.
- గంటా పద్మన, సోమగండి
================================
గ్రామ పెద్దలంతా నిర్ణయించుకుని..
గతంలో ఓటు అంటే నాకు తెలియదు. గ్రామంలో ఉన్న తోటి వాళ్లను చూసి ఓటు వేయడం తెలుసుకున్నా. ప్రస్తుతం నాకు 81ఏళ్లు. 25వ ఏట ఓటుహక్కును వినియోగించుకున్నా. అయితే నాలుగు కిలోమీటర్ల నడిచి పోలింగ్ బూత్‌కు వెళ్లాల్సి రావడంతో ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపేదాన్ని కాదు. అప్పట్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారు మా గ్రామాలకు వచ్చి ఓట్లు అడిగేవారు. గ్రామంలో పెద్దలు అందరూ నిర్ణయించుకుని మాకు నచ్చిన వారికి ఓటు వేసే వాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. బటన్ నొక్కి ఓటు వేస్తున్నాం.
- బిడ్డిక ఆరుద్రమ్మ, చీడిగూడ
================================
ప్రశాంత వాతావరణంలో ..
గతంలో ఓటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేది. ఓటు కోసం నోటు, లిక్కర్ ఇచ్చిన సందర్భాలు లేవు. అప్పట్లో ఎన్నికల కమిషన్ బ్యాలెట్లను వినియోగించేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల నుంచి ఓటు వేస్తున్నా. సుమారు 13 సార్లు జనరల్ ఎన్నికలకు ఓటు వేశాను. అప్పట్లో ప్రచారానికి ఆర్భాటాలు ఉండేవి కావు. నాయకులు, కొద్ది మంది కార్యకర్తలతో ఇంటింటికీ వచ్చి ప్రచారాలు చేసేవారు. ఇప్పుడంతా ఆర్భాటాలు, హడావుడితో ప్రచారాలు సాగుతున్నాయి. ప్రస్తుతం నాయకులు తీరు ఇబ్బందికరంగా ఉంది. అందరూ అధికార పార్టీలోనే ఉండేందుకు ఆసక్తి చూపు తున్నారు. ప్రతిపక్షం వైపు ఉండి పోరాటం చేసేందుకు ముందుకు రావడం లేదు. అప్పటి రాజకీ యాల్లో ఎంతో విలువలతో కూడిన నాయకులు ఉండేవారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చేవారు. తరచూ పార్టీలు మారే వారు కాదు.
- జగన్నాథసాహు, రిటైర్డ్ టీచర్, పాలకొండ