The Verdict Today తేలేది నేడే
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:15 AM
The Verdict Today పరిషత్ పోరులో నిలిచేదెవరో మంగళవారం తేలనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగుస్తుంది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల లెక్క తేలనుంది. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత రానుంది. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. స్థానిక బలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానాలు సూచించాయి. దీంతో అభ్యర్థులో టెన్షన్ నెలకొంది.
పరిషత్ పోరులో నలిచేదెవరో?
పార్వతీపురం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పరిషత్ పోరులో నిలిచేదెవరో మంగళవారం తేలనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగుస్తుంది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల లెక్క తేలనుంది. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత రానుంది. అయితే కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. స్థానిక బలాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానాలు సూచించాయి. దీంతో అభ్యర్థులో టెన్షన్ నెలకొంది. కాగా మధ్యాహ్నం మూడు గంటల లోపు అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. అయితే బీ ఫారం అందించిన వారే బరిలో నిలిచే అవకాశం ఉంటుంది. వారికే గుర్తులు కేటాయిస్తారు.
జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీల నుంచి 61 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 226 ఎంపీటీసీ స్థానాలకు 1181 మంది నామినేషన్లు వేశారు. ఇందులో టీడీపీ నుంచి 420 , జనసేన 108, బీజేపీ నుంచి 18 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో ఎంపీటీసీ స్థానాలకు పోటీ తీవ్రంగా ఉంది. కూటమి పార్టీల నుంచే అత్యధికులు నామినేషన్లు వేశారు. అయితే ఆయా అభ్యర్థుల్లో ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించు కుంటారన్నది చర్చనీయాంశమవుతోంది. జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఇదే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా బరిలో నిలిచేదెవరో.. రెబల్స్‌గా ఉండేదెవరో నేడు తేలనుంది.
ఉపసంహరణ ఇలా..
జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి సోమవారం పది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వారిలో టీడీపీ నుంచి ఇద్దరు, జనసేన పార్టీ ఇద్దరు, వైసీపీ ఐదుగురు, ఇతర పార్టీ నుంచి ఒకరు ఉన్నారు. మంగళవారం మరికొంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 113 మంది అభ్యర్థులు నామినేషన్లను విత్‌డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం 1068 మంది రంగంలో ఉన్నారు. అయితే వారిలో ఎంతమంది మంగళవారం నామినేషన్లు ఉపసంహరించుకుంటారన్నది చర్చ నీయాంశమవుతోంది.