Share News

The verdict is sealed in the ballot boxes. బ్యాలెట్‌ బాక్సుల్లో తీర్పు నిక్షిప్తం

ABN , Publish Date - Nov 02 , 2026 | 12:44 AM

The verdict is sealed in the ballot boxes. పుర పోరులో కీలక ఘట్టం పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న గొడవలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఓటర్ల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే పోలింగు బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరారు.

The verdict is sealed in the ballot boxes. బ్యాలెట్‌ బాక్సుల్లో   తీర్పు నిక్షిప్తం

బ్యాలెట్‌ బాక్సుల్లో

తీర్పు నిక్షిప్తం

మూడు చోట్లా పోలింగ్‌ ప్రశాంతం

ఓటింగ్‌ శాతం 62.65

రేపు కౌంటింగ్‌

గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా

విజయనగరంలో గట్టి పోరు.. అయినా టీడీపీకే మొగ్గు

బొబ్బిలి మునిసిపాల్టీలో ఏకపక్ష విజయం

నెల్లిమర్ల సైతం బీజేపీ సొంతమయ్యే అవకాశం

పుర పోరులో కీలక ఘట్టం పోలింగ్‌ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చిన్నచిన్న గొడవలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఓటర్ల తీర్పు బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచే పోలింగు బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 7 గంటలకు 62.65 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగు అనంతరం బ్యాలట్‌ బాక్సులను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్‌ రూంలకు తరలించారు. పట్టణ పోలింగ్‌లో కీలక దశగా చెప్పుకునే పోలింగ్‌ ముగిసింది. ప్రజా తీర్పుపై ఉత్కంఠ మొదలైంది. కౌంటింగ్‌ ఎప్పుడా అని అభ్యర్థులతో పాటు ప్రజలూ కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. విజేతలు ఎవరో తేలాలంటే మంగళవారం వరకు నిరీక్షించాల్సిందే.

విజయనగరం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉత్కంఠ మొదలైంది. ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రజల్లో ప్రారంభమైంది. ఎక్కడెక్కడ అనుకూలమో లెక్కలేసుకునే పనిలో అభ్యర్థులు మునిగారు. విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మునిసిపాల్టీ, నెల్లిమర్ల నగర పంచాయతీలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగలేదు. చిన్నచిన్న గొడవలు మినహా ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. మంగళవారం కౌంటింగ్‌ జరగనుంది. దీంతో అభ్యర్థులు, నేతలు కూడికలు, తీసివేతల లెక్కల్లో పడ్డారు.

తొలుత బొబ్బిలి మునిసిపాల్టీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఫలితం వచ్చే అవకాశం ఉంది. విజయనగరం నగరపాలక సంస్థ ఫలితం మాత్రం ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువ. ఇక్కడ 2 లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి. ఆ స్థాయిలో పోలింగ్‌ కాకపోయినా బ్యాలెట్లు కావడంతో లెక్కింపు ప్రక్రియలో జాప్యం జరిగే అవకాశాలే ఎక్కువ. పోలింగ్‌ ముగియడంతో ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

విజయనగరం మేయర్‌, బొబ్బిలి మునిసిపాల్టీ చైర్‌పర్సన్‌ విషయంలో టీడీపీకి స్పష్టమైన విజయం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. నెల్లిమర్ల బీజేపీకి కేటాయించాక కూటమిలో తలెత్తిన విభేదాలపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. అధికార టీడీపీ కూటమి, వైసీపీ మధ్య పోటీ ఉంది. ఇక అందరి దృష్టిమాత్రం విజయనగరం నగరపాలక సంస్థపైనే ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితాన్ని శాసించడం ద్వారా జిల్లాపై పట్టు కోసం ఉభయపక్షాలు గట్టి ప్రయత్నమే చేశాయి. టీడీపీ నుంచి అవనాపు భార్గవి, వైసీపీ నుంచి కోలగట్ల శ్రావణి రంగంలోకి దిగారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామిపై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన అదితిగజపతిరాజు విజయం సాధించారు. ఈ ఎన్నికల పోరులోనూ వారిద్దరే కీలక భూమిక పోషించారు. తన రాజకీయ వారసురాలిగా కోలగట్ల శ్రావణిని వచ్చే ఎన్నికల్లో బరిలో దించాలని వీరభద్రస్వామి భావిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో సర్వశక్తులూ ఒడ్డారు. ఇటు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా ఎంతమాత్రం తన పట్టు సడలకుండా పనిచేశారు. దీంతో విజయనగరంలో పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే అధికార కూటమి కావడం, ఆపై మూడు పార్టీలు సమన్వయంతో పనిచేయడం కూటమికి కలిసివచ్చే అంశం. కొన్ని డివిజన్లలో వైసీపీ పాగా వేయవచ్చు. మేయర్‌ స్థానం మాత్రం టీడీపీదేనని మెజార్టీ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.

ఎమ్మెల్యే బేబీనాయన చక్కని వ్యూహం

బొబ్బిలిలో టీడీపీకే చైర్మన్‌గా పోటీచేసే అభ్యర్థిత్వం దక్కింది. తొలుత కూటమిలో సీట్ల సర్దుబాటులో కొంత ప్రతిష్టంభన జరిగింది. ఎమ్మెల్యే బేబీనాయన, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడులు చాకచక్యంగా సమస్యను పరిష్కరించుకున్నారు. సవ్యంగా సీట్ల సర్దుబాటు చేయగలిగారు. ఆది నుంచీ ఇక్కడ టీడీపీకి సంస్థాగత బలం ఉండడంతో ఆ పార్టీ గెలుపు నల్లేరుమీద నడకగా మారింది. అయితే మాజీ చైర్‌పర్సన్‌ తూముల అచ్యుతవల్లిని వైసీపీ రంగంలోకి దించింది. ఆమె ఆర్థికంగా స్థోమతపరురాలు కావడం, ఆపై విద్యాసంస్థలు ఉండడం, మాజీ చైర్‌పర్సన్‌ కావడం కలిసి వస్తుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ టీడీపీ కూటమి పట్టుబిగించింది. దాదాపు అన్నివార్డుల్లో చేరికలను ప్రోత్సహించడం ద్వారా పోలింగ్‌ ముందే వైసీపీని కట్టడి చేసింది. అయితే ఓ ఐదారు వార్డులపై వైసీపీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

నెల్లిమర్లలో కొలువుదీరేదెవరో?

నాటకీయ పరిణామాలెన్నో..

నెల్లిమర్ల నగరపంచాయతీలో ఎన్నికలను కూటమి నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. శనివారం ఉదయం వరకు కూటమి అభ్యర్థి మైపాడ ప్రసాద్‌ విజయావకాశాలపై ఓ స్పష్టత రాలేదు. కొన్నిగంటల వ్యవధిలో కూటమి నాయకులు వ్యూహం మార్చారు. టిక్కెట్‌ ఆశించి భంగపడిన టీడీపీ నేత లెంక అప్పలనాయుడుతో మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు రంగంలోకి దిగి వ్యూహరచన చేశారు. అర్ధరాత్రి అక్కడే ఉండి గెలుపునకు కావాల్సిన రీతిలో కార్యకర్తలు, పార్టీ అభిమానులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే మాధవి కూడా బీజేపీ గెలుపునకు కృషిచేసినట్లు తెలుస్తోంది.

రంగంలో బావ - బావమర్ది

నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికల ప్రచార వ్యూహంలో ప్రత్యక్షంగా మాజీ జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తెరముందుకు రాగా, తెరవెనుక నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఉన్నారు. ఇద్దరూ టీడీపీ శ్రేణులు, తమ సహచరులతో మాట్లాడి గెలుపు కోసం కృషిచెయాలని కోరారు. ఈ విదంగా కూటమి పార్టీలు సమిష్టిగా బీజేపీ అభ్యర్థి ప్రసాద్‌ గెలుపునకు కృషిచేశారు.

------------------

కార్పొరేషన్‌లో 62.73 శాతం పోలింగ్‌

మందకొడిగా మొదలైన ఓటింగ్‌

విజయనగరం టౌన్‌, నవంబరు1(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం ఏడు గంటలకే పోలింగ్‌ ప్రారంభం కాగా మొదటి రెండు గంటలు మందకొడిగా సాగింది. ఉదయం 9 తరువాత పోలింగ్‌ శాతం పుంజుకుంది. కొన్నిచోట్ల సాయంత్రం ఐదు తరువాత కూడా ఓటర్లు క్యూలో వేచి ఉండటంతో గేట్లు మూసేసి వారికి ఓటు వేసే అవకాశాన్ని పోలింగ్‌ సిబ్బంది కల్పించారు. దీంతో రాత్రి 8.20 నిమిషాల వరకు పోలింగ్‌ సాగింది. పోలింగ్‌ శాతం 62.73శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.రామసుందరరెడ్డి తెలిపారు. నగరంలో మొత్తం ఓట్లు 2,23,050కాగా 1,39,911 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పురుషులు 67,050మంది, మహిళలు 72,851మంది, ఇతరులు 10మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు

నగరంలోని సాలిపేట ప్రాంతానికి చెందిన గురజాడ ప్రైవేటు పాటశాలలో ఎమ్మెల్యే అదితిగజపతిరాజు ఓటేశారు. అలాగే కూటమి అభ్యర్థి అవనాపు భార్గవి నాగోజీపేటలోని ప్రభుత్వ పాఠశాలలో ఓటేశారు. మాజీ మంత్రి, శాసనసభ ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ ఎంఆర్‌ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే ఆదితిగజపతిరాజు ఆదివారం నగరంలో పోలింగ్‌ సరళిని పరిశీలించారు. తొలుత ఓటుహక్కును వినియోగించుకుని ఆపై కంటోన్మెంట్‌, రింగురోడ్డు, దాసన్నపేట, ప్రదీప్‌నగర్‌, తోటపాలెం, కెఎల్‌పురం, కొత్తపేట, బొబ్బాదిపేట, పూల్‌బాగ్‌, గాజులరేగ తదితర ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఆయా వార్డుల్లో పోలింగ్‌ను పరిశీలించారు.

---------------

నెల్లిమర్లలో 80.31 శాతం పోలింగ్‌

నెల్లిమర్ల, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీలో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 9 గంటలకు 15 శాతం, 11 గంటలకు 30 శాతం, 12 గంటలకు 41.8 శాతం ఒంటిగంటకు 44.5 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 57.98శాతం, సాయంత్రం 4 గంటలకు 71.88 శాతం పోలింగ్‌ నమోదైంది. సాయంత్రం 5 గంటలకు 77.96 శాతం పోలింగ్‌ నమోదైనట్టు అధికారులు వెళ్లడించారు. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాల్లో 23 వార్డులకుగానూ 24 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ నిర్వహణకు 300 మందితో పోలీసు పహారా ఏర్పాటు చేశారు. విజయనగరం దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ వీర కుమార్‌ పర్యవేక్షణలో బందోబస్తు నడిచింది. ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల జిల్లా పరిశీలకుడు తేజ్‌ భరత్‌ పలు కేంద్రాలను సందర్శించారు. నగర పంచాయతీ చైర్మన్‌ బరిలో ఉన్న అభ్యర్థులు కనకల పద్మనాభం, లెంక అప్పలనాయుడు, మైపాడ ప్రసాద్‌, సముద్రపు రామారావు తదితరులు ఎన్నికల పోలింగ్‌ సరళిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం కనిపించింది. చైర్మన్‌ స్థానానికి నలుగురు, వార్డు సభ్యులకు 60 మంది బరిలో ఉన్నారు.

--------------

బొబ్బిలిలో 71.30 శాతం పోలింగ్‌

ఓటింగ్‌లో మహిళలదే పైచేయి

బొబ్బిలి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపల్‌ ఎన్నికల్లో 71.30 శాతం పోలింగ్‌ నమోదైంది. ఒకటి రెండు స్వల్పఘటనలు మినహా ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయి. ఓటింగ్‌లో కూడా మహిళా ఓటర్లదే పైచేయి అయింది. 18,373 మంది మహిళలు (72.3 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 16,763 మంది (70.23 శాతం) ఓటేశారు. పట్టణంలోని మొత్తం 36 వార్డులలో 49,284 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 35,141 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రెండో వార్డులో అత్యధికంగా 89.85 శాతం ఓటింగ్‌ జరిగింది. ఈ వార్డులో మొత్తం ఓటర్లు 1329 ఉండగా 1194 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. 23వ వార్డులో అత్యల్పంగా 49.93 శాతం పోలింగ్‌ నమోదు అయింది. ఈ వార్డులో మొత్తం 1404 మంది ఓటర్లు ఉండగా 701 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటరు స్లిప్పుల్లో వివరాలు కనిపించక అవస్థలు

ఓటరు స్లిప్పుల్లో పేర్లు, సీరియల్‌ నెంబరు, చిరునామాల వివరాలు స్పష్టంగా కనిపించక అటు ఎన్నికల అధికారులు, ఇటు ఎన్నికల ఏజెంట్లు, ఓటర్లు తీవ్ర అవస్థలకు గురయ్యారు. సీరియల్‌ నెంబర్లు సరిగ్గా కనిపించకపోవడంతో ఓటర్లు ఆగ్రహానికి గురయ్యారు. దీనివల్ల పలు చోట్ల పోలింగ్‌ నిర్వహణకు ఆలస్యమైంది. ఓటర్లు ఎక్కువ సేపు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది.

పాతబొబ్బిలి రోడ్డులోని ఆర్‌సీఎం స్కూలు పోలింగ్‌ బూత్‌, ప్రభుత్వ బాలిక హైస్కూలులోని పోలింగ్‌ బూత్‌ వద్ద నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్వల్ప ఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయఘటనలు జరగలేదు.

----------------------

Updated Date - Nov 02 , 2026 | 12:44 AM