Share News

కొలిక్కిరాని జిందాల్‌ వివాదం

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:29 AM

సంవత్సరాలు గడుస్తున్నా జిందాల్‌ వివాదం కొలిక్కిరావడం లేదు. దాదాపు 18 ఏళ్ల కిందట అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు కోసం జిందాల్‌కు భూములు కేటాయించినప్పుడు మొదలైన వివాదం నేటికీ కొనసాగుతోంది.

 కొలిక్కిరాని జిందాల్‌ వివాదం
జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రీయల్‌ పార్కు కార్యాలయం

- భూముల కోసం పోరాడుతున్న రైతులు

- అక్రమంగా పరిహారం పొందిన వారిపై

చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు

- ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల స్థాపనలో జాప్యం

- నిర్వాసిత గ్రామాలకు రానున్న జాతీయ ఎస్టీ కమిషన్‌

సంవత్సరాలు గడుస్తున్నా జిందాల్‌ వివాదం కొలిక్కిరావడం లేదు. దాదాపు 18 ఏళ్ల కిందట అల్యూమినియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు కోసం జిందాల్‌కు భూములు కేటాయించినప్పుడు మొదలైన వివాదం నేటికీ కొనసాగుతోంది. ఈ భూములను తమకు తిరిగి ఇచ్చేయాలని నిర్వాసిత రైతులు ఓపక్క ఆందోళనలు చేస్తుంటే, మరోపక్క తప్పుడు పత్రాలతో నష్ట పరిహారం పొందిన వారిపై రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇంకొకపక్క ఈ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. కోర్టు కేసులని, వివిధ కమిషన్లకు ఫిర్యాదులని ఇలా నిత్యం ఏదోఒక వివాదం చుట్టుముడుతోంది. తాజాగా, భూనిర్వాసిత రైతులకు న్యాయం చేసేందుకు జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ నిరాసిత గిరిజన గ్రామాల్లో పర్యటనకు సిద్ధమవుతుండడం చర్చానీయాంశంగా మారింది.

శృంగవరపుకోట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ముషిడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి, మూలబొడ్డవర, కిల్తంపాలెం గ్రామాల పరిధిలో 1127.76 ఎకరాల భూమిని 2007-2008 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం రిఫనరీ (జిందాల్‌)కి అప్పగించింది. అయితే అప్పట్లో జరిగిన భూసేకరణలో పలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ భూసేకరణను అప్పట్లో టీడీపీ, వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. ఇందులో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు నష్టపోయారు. ఇదే సమయంలో కొందరు భూములు కోల్పోయినట్లు తప్పుడు పత్రాలను సృష్టించి నష్ట పరిహారం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని నిగ్గు తేల్చేందుకు అప్పట్లో లోక్‌సత్తాపార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ.. రిటైర్డ్‌ రెవెన్యూ అధికారులతో (ఆర్డీవో స్థాయి) కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించింది. ఈ నివేదిక ప్రకారం అప్పట్లో కూకట్‌పల్లి (హైదరాబాద్‌) శాసన సభ్యుడిగా వ్యవహరించిన జయప్రకాష్‌ నారాయణ శాసన సభలో ప్రస్తావించారు. అప్పటి రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ వ్యవహారాన్ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి అప్పగించారు. విచారణ చేపట్టిన ఏసీబీ భూములు లేకుండానే 12మందికి రూ.36.10లక్షలు చెల్లించినట్లు నిర్ధారించింది. ఇది జరిగి సంవత్సరాలు గడుస్తున్నా అక్రమార్కులపై ఎలాంటి చర్యలు లేవు. వారికి ఒకట్రెండు దపాలు నోటీసులు జారీ చేసి ఊరుకున్నారు.

ఏర్పాటు కాని పరిశ్రమ..

అల్యూమినియం శుద్ధి కర్మాగారం (రీఫైనరీ, విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌) ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్న జిందాల్‌ యాజమాన్యం ఎటువంటి పరిశ్రమను నిర్మించలేదు. కనీసం పునాదిరాయి కూడా వేయలేదు. దీంతో భూములిచ్చిన రైతులు తిరిగి వాటిని స్వాధీనం చేసుకునేందుకు పోరాటం చేస్తున్నారు. అయితే, ఆ భూముల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల నిర్మాణానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. దాదాపు 18సంవత్సరాలుగా ఖాళీగా ఉంచిన భూములను ఎంఎస్‌ఎంఈలకు ఇవ్వడాన్ని నిర్వాసిత రైతులు వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన హమీలను ఎవరు నెరవేరుస్తారని ప్రశ్నిస్తున్నారు. తిరిగి తమ భూములను ఇచ్చేయాలని గతేడాది జూన్‌ నుంచి ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్‌లకు ఫిర్యాదు చేశారు. హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి.

చర్యలకు సిద్ధమైన అధికారులు..

భూములకు సంబంధించి తప్పుడు పత్రాలతో నష్టపరిహారం పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావు ఈనెల 17న ఉన్నతాధికారులకు నివేదించారు. ఈ మేరకు వారి ఆస్తుల జప్తుకు సిద్ధపడుతున్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా వారికి నోటీసులు పంపించారు. 12 మందిలో ఏడుగురికి మాత్రమే భూములు, నివాసాలు ఉన్నాయి. వారి భూములు క్రయ, విక్రయాలు జరగకుండా, నివాసాలను స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన ఐదుగురికి ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల తరువాత రెవెన్యూ అధికారులు చర్యలకు దిగుతుండడం చర్చానీయంశంగా మారింది.

30న జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుల రాక

జిందాల్‌ భూ నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు ఈ నెల 30న జిల్లాకు రానున్నారు. కమిషన్‌ సభ్యులు జతోత్తుహుస్సేన్‌, డైరెక్టర్‌ పి.కళ్యాణ్‌ రెడ్డి, ప్రైవేటు సెక్రటరీ అశోక్‌కుమార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రోటోకాల్‌ ఏర్పాట్ల బాధ్యతను విజయనగరం రెవెన్యూ డివిజనల్‌ అధికారికి అప్పగించారు. కమిషన్‌ సభ్యులు ఆరోజు ఉదయం 10.30గంటలకు శృంగవరపుకోట మండలానికి చేరుకోనున్నారు. ఈ మండల పరిధిలోని గిరిజన గ్రామాల్లో మధ్యాహ్నం ఒంటి గంటవరకు ప్రజా విచారణ చేయనున్నారు. అనంతరం నాలుగు గంటలకు జిల్లా సమీక్ష జరగనుంది. ఇప్పటికే ఎస్టీ కమిషన్‌ సభ్యులు.. జిల్లా, డివిజన్‌, మండల స్థాయి రెవెన్యూ అధికారులను తన కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. అంతటితో ఆగకుండా భూనిర్వాసిత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - Mar 21 , 2026 | 12:29 AM