The time has arrived for a magnificent event. మహాద్భుత ఘట్టానికి వేళాయె
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:35 AM
The time has arrived for a magnificent event. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వేళ అయింది. పుష్కర కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న ఆ మహత్తర వేడుకకు సమయం రానే వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ మరికొద్ది గంటల్లో ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. 13వేల మందికి పైబడి గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు.
మహాద్భుత ఘట్టానికి వేళాయె
భోగాపురం ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
పూర్తయిన ఏర్పాట్లు
ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే
ప్రధాని, సీఎం సభకు సర్వం సిద్ధం
ఏడు వేలమంది పోలీసులతో భద్రత
4500 బస్సుల్లో రానున్న ప్రజలు
విజయనగరం/భోగాపురం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి వేళ అయింది. పుష్కర కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న ఆ మహత్తర వేడుకకు సమయం రానే వచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ మరికొద్ది గంటల్లో ఎయిర్‌పోర్టును జాతికి అంకితం చేయనున్నారు. 13వేల మందికి పైబడి గిరిజన మహిళలు, విద్యార్థినులు థింసా నృత్యంతో ప్రధానికి స్వాగతం పలకనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌కల్యాణ్, గవర్నర్ అబ్ధుల్ నజీర్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతీ సాంప్రదాయ కళలు ఉట్టి పడేలా విమానాశ్రయాన్ని అలంకరించారు. టెర్మినల్ స్వాగత ద్వారం వద్ద అందరినీ ఆకట్టుకునేలా భారీ స్థాయిలో ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, తోలుబొమ్మలు, భౌగోళిక వారసత్వం తెలియచెప్పేలా బంగినపల్లి మామిడిపండు చిత్రాలతో అలంకరించారు. ఇదే రోజు విమాన సర్వీసుల నిర్వహణ కోసం ఎయిర్‌ఇండియా సంస్థ తొలి షెడ్యూల్ ప్రకటించనుంది.
ప్రధాని మోదీ పర్యటిస్తారిలా..
శనివారం ఉదయం 10.45 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్‌పోర్టులో దిగనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలకనున్నారు. 10.50 గంటలకు ఓపెన్ టాప్ జీపులో మోదీ టెర్మినల్‌కు చేరుకుంటారు. అనంతరం విమానాశ్రయాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 12.55 గంటల వరకూ ప్రారంభోత్సవం, సభలో ప్రసంగాలు కొనసాగనున్నాయి. చివరిగా ప్రధాని మోదీ ప్రసంగం ఉండనుంది. 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో తిరగి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
ఫ రాష్టం నలుమూలల నుంచి సుమారు 2.10 లక్షల మంది సభకు రానున్నట్లు అధికారులు అంచనావేశారు. ఇందుకు తగ్గట్లు 4500 బస్సులను ఏర్పాటు చేశారు. 7వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సేవలకోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 700 మంది వైద్యులు, సిబ్బందితో 130 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా..
వివిధ ప్రాంతాల నుంచి భోగాపురానికి శనివారం వేకువజాము నుంచే బస్సులు ప్రారంభమవుతాయి. బస్సుల్లోనే ప్రజలకు అల్పాహారం అందేలా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం సభ ముగిసిన తరువాత భోజన పొట్లాలు అందేలా కూడా ఏర్పాట్లు పూర్తిచేశారు. భోజనాలకు సంబంధించి ఏజెన్సీలకు అప్పగించారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలో 15 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటుచేశారు. నిర్దేశించిన జిల్లాకు చెందిన వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ కేంద్రంలోనే ఉంచాలి.
సమన్వయంతో పనిచేయాలి
హోం మంత్రి అనిత
విజయనగరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులంతా సమన్వయంతో పనిచెయ్యాలని హోంమంత్రి వంగలపూడి అనిత అదేశించారు. శుక్రవారం ఆమె విమానాశ్రయం ఆవరణలో కమాండ్ కంట్రోల్ రూమ్‌వద్ద పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్ల గురించి తెలుసుకుని సూచనలు ఇచ్చారు. అందరూ సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చెయ్యాలన్నారు.
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
భోగాపురం, జూలై31(ఆంధ్రజ్యోతి): విమానాశ్రయం ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన బందోబస్తులో పోలీస్ అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. భద్రత ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. 3వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్‌లోని ఎల్‌ఈడీ స్ర్కీన్స్‌కు అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఆయన వెంట శాంతిభద్రతల అదనపు డీజీ ఎన్.మధుసూదనరెడ్డి, ఐజీలు ఆర్‌కె రవికృష్ణ, గోపీనాథ్ జట్టీ, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఉన్నారు.
ట్రయల్ రన్ సక్సెస్
భోగాపురం, జూలై31(ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ప్రారంభోత్సవం సందర్భంగా ముందస్తుగా సభా ప్రాంగణానికి, పార్కింగ్ స్థలాలకు ప్రజలను ఏవిధంగా తీసుకెళ్లి క్షమంగా తీసుకురావాలనే దానిపై శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. అత్యధికంగా బస్సులు రావడంతో చుట్టుపక్కల ప్రజానీకం వింతగా తిలకించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విమానశ్రయంతో పాటు రహదారులన్నీ టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో కళగా దర్శనమిస్తున్నాయి.