The time for the Parishad battle పరిషత్ పోరుకు వేళాయే
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:22 PM
The time for the Parishad battle జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు కూడా నగరా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది. 27 జడ్పీటీసీలు, 449 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
పరిషత్ పోరుకు వేళాయే
ప్రాధేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
వైసీపీ హయాంలో ప్రలోభాలతో జడ్పీటీసీలు సైతం ఏకగ్రీవం
స్వేచ్ఛాయుత ఓటింగ్ వైపే కూటమి మొగ్గు
ఎంపీపీలు, జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా
విజయనగరం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలకు కూడా నగరా మోగింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయ్యింది. 27 జడ్పీటీసీలు, 449 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్‌ను, ఎంపీటీసీలు ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. కాగా ఈసారి జిల్లా పరిషత్ పీఠాన్ని మహిళలకు రిజర్వు చేశారు. జడ్పీసీలు, ఎంపీపీలకు సంబంధించి 13 చొప్పున మహిళలకు కేటాయించారు. 449 ఎంపీటీసీలకుగాను 217 మహిళలకు కేటాయించారు. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో బీసీలకు తొమ్మిది చొప్పున కేటాయించారు. 5 బీసీ జనరల్, మిగిలిన నాలుగు బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. కాగా అన్ రిజర్వుడ్ కేటగిరిలోనూ బీసీలు పోటీచేసే అవకాశం ఉంది. 7 జనరల్, ఇంకో 7 జనరల్ మహిళకు ఇచ్చారు.
గతానికి భిన్నంగా..
ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో గత పరిస్థితులు తలెత్తకపోవచ్చు. వైసీపీ హయాంలో జడ్పీటీసీ స్థానాలను సైతం ఏకగ్రీవం చేసుకున్నారు. అప్పట్లో టీడీపీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. అన్ని మండలాల్లో జడ్పీటీసీ అభ్యర్థులను బరిలోకి దించింది. వైసీపీ కొన్ని జడ్పీటీసీ స్థానాలను భయపెట్టి ఏకగ్రీవం చేసుకుంది. తరువాత సాంకేతిక కారణాలతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ప్రాదేశిక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా టీడీపీ అధిష్టానం బహిష్కరణ నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీ పదవులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది.
ప్రజా తీర్పు కోరాలని..
కూటమి ప్రభుత్వం ఎక్కడా ఏకగ్రీవానికి ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలంటూ హడావుడి చేసింది. కడప జిల్లా తరువాత జడ్పీటీసీలు ఏకగ్రీవం జరిగింది విజయనగరం జిల్లాలోనే. ప్రజాస్వామ్యం ఖూనీ చేసి మరీ దూకుడుగా ప్రవర్తించింది. ఆ పరిస్థితి తేకూడదని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రజాస్వామ్యయుతంగానే ప్రాదేశిక ఎన్నికలకు వెళ్లాలనుకుంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతోంది. ప్రజాదరణతోనే అన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీ స్థానాలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని చూస్తోంది.
--------------------
షెడ్యూల్ ఇలా..
విజయనగరం కంటోన్మెంట్, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఈ నెల 21 నుంచి 23 వరకూ అభ్యర్థుల నామినేషన్లు వేసేందుకు గడువు విధించారు. నామినేషన్ల పరిశీలన ఈనెల 24న జరగనుంది. తిరస్కరించే నామినేషన్లపై అప్పీళ్ల కోసం ఎంపీటీసీ అభ్యర్థులు అయితే ఆర్డీవో, జడ్పీటీసీ అభ్యర్థులు అయితే కలెక్టర్‌ను సంప్రదించాలి. ఆయా అధికారులు 26వ తేదీన పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ గడువిచ్చారు. పోలింగు నవంబరు 3న జరుగుతుంది. రీ పోలింగు అవసరమైన చోట్ల నవంబరు 4న చేపడ్తారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబరు 5న ఉంటుంది.