Share News

లక్ష్యాలను పూర్తి చేయాలి:జేసీ

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:32 PM

జిల్లాలో భూ రీసర్వే లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 లక్ష్యాలను పూర్తి చేయాలి:జేసీ
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ

పార్వతీపురం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ రీసర్వే లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని రెవెన్యూ అంశాలు, రెవెన్యూ క్లినిక్‌ల పనితీరుపై సోమవారం తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పారదర్శకమైన పాలన అందించాలని ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తహసీల్దార్లు సమర్పించిన రిపోర్టులను జేసీ పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులు, సామాన్య ప్రజలకు సేవలు అందించాలని జేసీ పేర్కొన్నారు.

పట్టా ఇచ్చారు...స్థలం మరిచారు

వైసీపీ ప్రభుత్వంలో తనకు ఇంటి పట్టా ఇచ్చారని, కానీ స్థలం మాత్రం కేటాయించలేదని పార్వతీపురం పట్టణానికి చెందిన బొండపల్లి నాగమణి అనే మహిళ సోమవారం జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. అధికారులు స్థలం చూపించకపోవడంతో ఇల్లు కట్టుకోలేకపోతున్నానని, తనకు స్థలం చూపించి ఇళ్లు మంజూరు చేయాలని కోరింది. దీనిపై జేసీ స్పందిస్తూ.. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని, ఆమెకు స్థలాన్ని చూపించాలని తహసీల్దార్‌ సురేష్‌ను ఆదేశించారు.

Updated Date - Jan 19 , 2026 | 11:32 PM