రూ.14 కోట్ల ఫీజు వసూలే లక్ష్యం
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:22 AM
విజయనగరం జిల్లాలో మొత్తం 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయని, వాటి ద్వారా రూ. 14 కోట్లు మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యం అని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టరు రవికిరణ్ తెలిపారు.
బొబ్బిలి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లాలో మొత్తం 8 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయని, వాటి ద్వారా రూ. 14 కోట్లు మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యం అని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టరు రవికిరణ్ తెలిపారు. స్ధానిక ఏఎంసీలో గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు రూ.5.89 కోట్ల మార్కెట్ ఫీజు వసూలైందన్నారు. సివిల్ సప్లయిస్ నుంచి రూ.22 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. ఆ బకాయిలు విడుదలైతే మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యాలు నెరవేరతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 చెక్‌పోస్టులు ఉన్నాయని, వాటిని బలోపేతం చేస్తామన్నారు. అధికారులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించినట్టు తెలిపారు. బొబ్బిలి ఏఎంసీలో రూ. 3 కోట్లు మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యం కాగా ఇంతవరకు రూ.1.10 కోట్లు వసూలైందన్నారు. మార్చి నెలాఖారునాటికి జిల్లాలో లక్ష్యాలను నెరవేర్చుతామని తెలిపారు. జిల్లాలో ఏడు రైతు బజార్లు ఉన్నాయని, బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు కోసం జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్, కమిషనరులతో చర్చించామన్నారు. స్ధలసేకరణ కోసం రెవిన్యూ అధికారులకు లేఖలు రాశామన్నారు. స్ధలసేకరణ జరిగిన వెంటనే రైతు బజారు ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు.