మద్దతు ధర అరకొరే!
ABN , Publish Date - May 15 , 2026 | 12:01 AM
ఈ ఖరీఫ్ సీజన్‌కు (2026-27) సంబంధించి రైతులు పండించే వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది.
- వరి క్వింటాకు రూ.72 పెంపు
- 80 కేజీల బస్తా రూ.1,952
- మొక్కజొన్నపై రూ.10, పెసరపై రూ.12 పెరుగుదల
- రైతులు తీవ్ర అసంతృప్తి
పాలకొండ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఈ ఖరీఫ్ సీజన్‌కు (2026-27) సంబంధించి రైతులు పండించే వివిధ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. అయితే, మద్దతు ధర అరకొరగా ఉండడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటించింది. క్వింటా వరి గ్రేడ్-1 రకం రూ.2,461, కామన్ రకం రూ.2,441గా నిర్ణయించింది. గత ఏడాది గ్రేడ్-1 రకం రూ.2,389, కామన్ రకం రూ.2,369 ఉండేది. ఈ ఖరీఫ్‌లో క్వింటాకు రూ.72 మద్దతు ధరను పెంచడంతో రూ.2,461 అయింది. దీని ప్రకారం 80కేజీల ధాన్యం బస్తా రూ.1,952 పలకనుంది. అదే విధంగా క్వింటా మొక్కజొన్నకు రూ.10, పెసరకు రూ.12 నామమాత్రంగానే పెంచారు. కందులకు రూ.450, మినుములకు రూ.400, పత్తికి రూ.567 మద్దతు పెరిగింది. కేవలం కంటితుడుపు చర్యగానే ధరలు పెంచినట్టు రైతులు పేర్కొంటున్నారు. మన్యం జిల్లా వ్యాప్తంగా 70 శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దళారులను ఆశ్రయించి పంటలను అమ్ముకోవాల్సి వస్తుందని రైతాంగం నిట్టూరుస్తుంది. సాగుకు అవుతున్న ఖర్చులకు, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరకు పొంతన ఉండడం లేదు. ప్రతిఏటా రెండుసార్లు ఎరువులు, పురుగు మందులు ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కూలి రేట్లు కూడా గణనీయంగా పెరిగాయి. వ్యవసాయ పనులకు వచ్చేవారి సంఖ్య తగ్గడంతో కూలీల డిమాండ్ చేసిన డబ్బులను రైతులు చెల్లించాల్సి వస్తుంది. ఓ పక్క ప్రకృతి వైపరీత్యాలు, పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లు పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గణనీయంగా పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులు నుంచి రైతాంగం కోలుకోలేని పరిస్థితిలో ఉంది. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతాంగానికి లాభసాటిగా లేదని అంతా పేర్కొంటున్నారు. రోజురోజుకూ వ్యవసాయం చేసేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని ప్రభుత్వం మద్దతు ధర మరింత ప్రకటించాలని రైతాంగం పేర్కొంటుంది.
మూడేళ్లలో ప్రధాన పంటల మద్దతు ధరలు (క్వింటాకు)
సంవత్సరం పంట మద్దతు ధర
2024-25 వరి (సాధారణం) రూ.2,300
గేడ్-ఏ రకం రూ.2,320
పత్తి రూ.7,521
మొక్కజొన్న రూ.2,225
కందులు రూ.7,550
మినుమలు రూ.7,400
పెసర రూ.8,682
2025-26 వరి (సాధారణం) రూ.2,369
గేడ్-ఏ రకం రూ.2,389
పత్తి రూ.8,110
మొక్కజొన్న రూ.2,400
కందులు రూ.8,000
మినుమలు రూ.7,800
పెసర రూ.8,768
2026-27 వరి (సాధారణం) రూ.2,441
గేడ్-ఏ రకం రూ.2,461
పత్తి రూ.8,667
మొక్కజొన్న రూ.2,410
కందులు రూ.8,450
మినుమలు రూ.8,200
పెసర రూ.8,780