Share News

బాబోయ్‌ ఎండలు

ABN , Publish Date - May 21 , 2026 | 10:31 PM

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

బాబోయ్‌ ఎండలు
ఉదయం 11 గంటలకు నిర్మానుష్యంగా వీరఘట్టం ప్రధాన రహదారి

- జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు

- సాలూరులో 44.7 డిగ్రీలు నమోదు

పార్వతీపురం, మే 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చాలా మండలాల్లో గురువారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలకు జన సంచారం లేక రోడ్లు, ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం 11 గంటల నుంచి 4 వరకూ వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. కూలీలు, రోడ్డు పక్కన వ్యాపారులు చేసే వారు ఇబ్బందులు పడడం కనిపించింది. సాలూరు పట్టణంలో మధ్యాహ్నం 12 గంటలకు 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాచిపెంటలో 44, వీరఘట్టంలో 43.9, మక్కువలో 43.7, జియ్యమ్మవలసలో 43.4, పాలకొండలో 43.1, బలిజిపేటలో 42.7, భామినిలో 42.6, కురుపాంలో 42, గుమ్మలక్ష్మీపురంలో 41.4, సీతంపేటలో 40.6, గరుగుబిల్లిలో 40.5, కొమరాడలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లాల్సి వస్తే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ వంటి ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా తలకు టోపీ, గొడుగు వినియోగించాలని అంటున్నారు.

Updated Date - May 21 , 2026 | 10:31 PM