The ‘Struggles’ for a Fair Return గిట్టు‘పాట్లు’
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:12 AM
The ‘Struggles’ for a Fair Return చిన్న చిన్న కమతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ కుటుంబమంతా శ్రమిస్తున్నా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో వంకాయలు, క్యాబేజీ, పాలకూర, చుక్కకూర, చిక్కుడు కాయలు, ముల్లంగి తదితర పంటలను రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అర ఎకరంలో క్యాబేజీ సాగుకు సుమారు రూ.10 వేల పెట్టుబడి అవుతుండగా, 90 రోజులకు పంట దిగుబడి వస్తుంది.
గిట్టు‘పాట్లు’
కూరగాయల రైతులకు తప్పని నష్టాలు
లాభపడుతున్న దళారులు
బొబ్బిలిలో కానరాని రైతుబజార్
బొబ్బిలి రూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి):
చిన్న చిన్న కమతాల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ కుటుంబమంతా శ్రమిస్తున్నా రైతులకు గిట్టుబాటు ధరలు లభించడంలేదు. బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో వంకాయలు, క్యాబేజీ, పాలకూర, చుక్కకూర, చిక్కుడు కాయలు, ముల్లంగి తదితర పంటలను రైతులు విరివిగా సాగు చేస్తున్నారు. అర ఎకరంలో క్యాబేజీ సాగుకు సుమారు రూ.10 వేల పెట్టుబడి అవుతుండగా, 90 రోజులకు పంట దిగుబడి వస్తుంది. ఒక్కో బాస్కెట్లో 20 నుంచి 25 క్యాబేజీ పువ్వులు ఉంటాయని, దళారులు రూ.250 నుంచి రూ.300 మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. అదే బాస్కెట్‌ను బొబ్బిలి మార్కెట్లో నేరుగా విక్రయిస్తే సుమారు రూ.1000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా చెమటకు విలువలేదు, కష్టాలకు గిట్టుబాటు లేదని’ అంటున్నారు.
నాసిరకం విత్తనాలతో కష్టాలు..
వ్యవసాయ శాఖ నుంచి కానీ, ఆర్ఎస్కే ద్వారా కానీ అవసరమైన విత్తనాలు అందడం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ప్రైవేటు మార్కెట్లో లభించే విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేయాల్సి వస్తోందని, వాటి నాణ్యతపై కూడా ఆందోళనగా ఉందని చెబుతున్నారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడం, పెట్టుబడుల ఖర్చులు పెరగడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని అంటున్నారు. ఈ విషయంపై ఏవో మజ్జి శ్యామ్‌సుందర్‌ను వివరణ కోరగా... ‘త్వరలో బొబ్బిలిలో రైతు బజారు ఏర్పాటు కానుంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తాం’ అని తెలిపారు.
రైతుబజారు ఉంటే ఉపయోగం
50 సెంట్లలో క్యాబేజీ సాగు చేస్తున్నా. రూ.పది వేల వరకు పెట్టుపడి పెట్టాను. తీరా పంట చేతికొచ్చాక దళారులు బాస్కెట్‌కు రూ. 250 నుంచి రూ. 300 మాత్రమే ధర చెబుతున్నారు. మేము నేరుగా రైతు బజారులో విక్రయించుకునే సదుపాయం ఉంటే మాకు బాస్కెట్‌కు సుమారు రూ. 800 నుండి రూ. 1000 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వం అందించాలి.
- గొట్టాపు రాము, రైతు, కారాడ
గిట్టుబాటు ధర కల్పించాలి
నాకున్న 80 సెంట్ల భూమిలో ఆకుకూరలు పండిస్తున్నాను. కుటుంబమంతా కష్టపడి పంటలు పండిస్తున్నాం. అయినా గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతు బజారు లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆర్ఎస్కేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందించాలి. మాకు గిట్టుబాటు ధర కల్పించాలి.
- సాగర్ల జయమ్మ, రైతు, కారాడ
-------------