Share News

1/70 చట్టం అమలయ్యే వరకూ పోరాటం

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:14 AM

గిరిజనుల హక్కులను కాపాడే జీవో నెంబర్‌-3, ఏజెన్సీ భూ బదలాయింపు చట్టం 1/70 పూర్తిస్థాయిలో అమ లు జరిగే వరకు గిరిజన సంఘాలన్నీ సమైక్యంగా పోరాడాలని గిరిజన జేఏసీ లో వివిధ సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు.

1/70 చట్టం అమలయ్యే వరకూ పోరాటం
మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల హక్కులను కాపాడే జీవో నెంబర్‌-3, ఏజెన్సీ భూ బదలాయింపు చట్టం 1/70 పూర్తిస్థాయిలో అమ లు జరిగే వరకు గిరిజన సంఘాలన్నీ సమైక్యంగా పోరాడాలని గిరిజన జేఏసీ లో వివిధ సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. మండల కేంద్రంలో ఆది వారం గిరిజన సంఘాల జేఏసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించింది. జేఏసీ చైర్మన్‌, మాజీ డిప్యూటీ కలెక్టర్‌ కె.ధర్మారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి హాజరై మాట్లాడారు. రెండు చట్టాలు అమలు జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ విషయం సీఎవ చంద్ర బాబు నాయుడుతో మాట్లాడతానన్నారు. జీవో నెంబర్‌-3 రద్దు వల్ల గిరిజ నులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్‌ మాట్లాడుతూ ఈ చట్టాల అమలుకు న్యాయపరంగా కోర్టుల్లో ఉద్య మాలు రూపంలో కలిసి కట్టుగా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. కె. ధర్మారావు మాట్లాడుతూ గిరిజనులు పార్టీలకు అతీతంగా గిరిజనుల హక్కుల కోసం పోరాడాలన్నారు. మరో మాజీ డిప్యూటీ కలెక్టర్‌ ఆరిక నీలకంఠం మాట్లాడుతూ రెండు చట్టాలు పూర్తిస్థాయిలో అమలు జరిగేలా గిరిజనుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌ బొత్తాడ గౌరీశంకరరావు, విప్లవకుమార్‌, మండంగి రమణ, నిమ్మక సింహాచలం, లోవరాజు, రామకృష్ణ, సీతారాం, ఆరిక చంద్రశేఖర్‌, పాడి సుధ, బిడ్డిక రామారావు, డీటీ శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 12:14 AM