The Storm That Claimed Lives ఆరిన ఇంటి దీపం
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:42 PM
The Storm That Claimed Lives గాలివాన ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. హోరు గాలి.. జోరు వానకు నగుళ్లు గ్రామంలో రెండు మేకల శాలలు కుప్పకూలాయి. దీంతో లోపల ఉన్న మువ్వల రేవతి(35)తో పాటు పది మేకలు మృతి చెందాయి.
మేకల శాలలు కూలి మహిళ మృతి.. 10 మేకలు కూడా..
మక్కువ రూరల్, ఏప్రిల్21(ఆంధ్రజ్యోతి): గాలివాన ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. హోరు గాలి.. జోరు వానకు నగుళ్లు గ్రామంలో రెండు మేకల శాలలు కుప్పకూలాయి. దీంతో లోపల ఉన్న మువ్వల రేవతి(35)తో పాటు పది మేకలు మృతి చెందాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు వివరాల మేరకు.. నగుళ్లులో కమ్యూనిటీ హెల్త్‌వర్కరుగా పనిచేస్తోన్న రేవతి అప్పడప్పుడూ తన మేకలను మేత కోసం పొలాలకు తీసుకెళ్తుంది. ఆమెకు భర్త, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే రోజూలానే మేకల శాలలకు వద్దకు వెళ్లిన రేవతి మాత్రం ఇంటికి చేరుకోలేదు. మంగళవారం సాయంత్రం గ్రామ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. ఈదురు గాలులకు గ్రామానికి తూర్పుదిక్కున ఉన్న మేకల శాలలు గాలలుకు కూలిపోయింది. దీంతో అందులోనే ఉన్న రేవతి తీవ్ర గాయాలపాలైంది. ఐదు మేకలు మాత్రం అక్కడికక్కడే మృతి చెందాయి. వర్షం తగ్గిన తర్వాత కొంతమంది వ్యక్తులు మేకల శాలకు వద్దకు వెళ్లగా.. అపస్మాకర స్థితిలో ఉన్న రేవతిని చూసి హుటాహుటిన సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె అక్కడ మృతి చెందిందని నగుళ్లు గ్రామస్థులు తెలిపారు. ఆమె ఆకస్మిక మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. కాగా అదే గ్రామంలోని పువ్వల చిన్నప్పకు చెందిన మేకల శాలలో మరో 5 మేకలు కూడా గాలివానకు మృతిచెందినట్లు బాఽధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఎం.వెంకటరమణ గ్రామానికి చేరుకుని ఘటనా ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో పలుచోట్ల ఇలా..
పార్వతీపురం, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురంతో పాటు పార్వతీపురం, కొమరాడ తదితర మండలాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. సీతంపేట, వీరఘట్టం మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం వరకూ ఎండ ఠారెత్తించగా ఆ తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలులతో పలుచోట్ల జోరువాన కురిసింది. పార్వతీపురం టౌన్‌లో సుమారు గంటపాటు వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కూడళ్లలో వర్షపునీరు నిలిచింది. దీంతో ప్రజలు, వాహనదారుల రాకపో కలకు ఇబ్బందులు తప్పలేదు. పార్వతీపురం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంత రాయం ఏర్పడింది. మరోవైపు గాలుల కారణంగా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏదేమైనా వాతావరణం చల్లబడడంతో ఎండ వేడి నుంచి జిల్లావాసులు కాస్త ఉపశమనం చెందారు.