అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు..
ABN , Publish Date - May 15 , 2026 | 12:28 AM
తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు, టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో విజయనగరం జిల్లా రేగిడి మండలం పనసలవల సకు చెందిన యువకుడు మృతిచెందాడు.
రేగిడి, మే 14,(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు, టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో విజయనగరం జిల్లా రేగిడి మండలం పనసలవల సకు చెందిన యువకుడు మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. రేగిడి మండలం పనసలవలసకు చెందిన నారు అప్పలనాయుడు, సత్యవతి దంపతులు విశాఖలో తాపి పనిచేస్తూ స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్దవాడు సాయి అనీల్ కుమార్ (24), చిన్నవాడు గోపాల్. తల్లిదండ్రులు కాయకష్టంతో పిల్లలని ప్రయోజకులు చేయాలని కలలు కన్నారు. ఇద్దరి పిల్లలను డిగ్రీ వరకు చదివించారు. వీరిలో పెద్దవాడు సాయి అనీల్ ఇటీవల ఫార్మసీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఒకటి రెండురోజుల్లో ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంది. ఆ కుటుంబం విజయవాడలో ఉన్న బంధువుల ఇంట్లో ఒక శుభకార్యానికి వెళ్లేందుకు బుధ వారం సాయంత్రం విశాఖలో ప్రైవేటు బస్సు ఎక్కింది. బస్సు గురువారం తెల్లవా రేసరికి తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు టిప్పర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్న సాయి అనీల్‌కుమార్ ఊహిం చని విధంగా మృతిచెందాడు. ఈ ఘటనలో ఈయన సోదరుడు గోపాల్‌కు గాయాలయ్యాయి. తల్లిదండ్రులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా తనువు చాలించటం, చిన్న కుమారుడు గాయాలు పాల వ్వటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈఘటనతో పనసలవలసలో విషాదఛాయలు అలముకున్నాయి.