సముద్రం.. కలుషితమయం
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:29 PM
జిల్లాలో సముద్రపు జలాలు కలుషితవుతున్నాయి. తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి.
- తీరంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు
- కలుస్తున్న పరిశ్రమల వ్యర్థ జలాలు
- అంతరించిపోతున్న అనేక సముద్రపు జీవులు
భోగాపురం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సముద్రపు జలాలు కలుషితవుతున్నాయి. తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు చెత్తాచెదారం పేరుకుపోతున్నాయి. పరిశ్రమల వ్యర్థ జలాలు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని అనేక సముద్రపు జీవులు కనుమరుగవుతున్నాయి. జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ మండలాల పరిధిలో సుమారు 28 కిలోమీటర్లు బంగాళాఖాతం సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి 16 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. సుమారు 21వేల జనాభా జీవిస్తున్నారు. ప్రత్యేక్ష, పరోక్షంగా చేపలవేటపై సుమారు 4,500 మంది ఆధారపడి బతుకుతున్నారు. ఏడాదికి సుమారు 3వేల నుంచి 3,500 టన్నుల వరకు మత్స్య సంపద ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాంతంలో సరైన జీవనాధారం లేకపోవడంతో ప్రతి ఏడాదీ సుమారు రెండు వేల మంది వరకూ వలసలు వెళ్లి పోతుంటారు. ఈ ప్రాంతంలో గతంలో బారీ కోనాలు, బారీ టేకు చేపలు, టైగర్ రొయ్యలతో పాటు అనేక రకాలకు చెందిన పెద్దపెద్ద చేపలు లభ్యమయ్యేవి. అయితే, తీరంలో ఉన్న అనేక పరిశ్రమలు తమ వ్యర్థ జలాలను నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతున్నాయి. అధికంగా ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర తీరంలో పేరుకుపోవడంతో నీరు కలుషితమై అనేక రకాల చేపలు అంతరించిపోయినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రపు తాబేళ్లు కూడా మృత్యువాత పడుతూ తీరానికి కొట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చిన్న కవళ్లు, కానాకడతలు, తోలు పారలు, రొయ్యలు, చిన్నచిన్న చేపలు మాత్రమే లభ్యమవుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
కాపాడుకోవడం అందరి బాధ్యత..
మనం నివశించే భూగ్రహం సుమారు 71శాతం సముద్రపు నీటితో నిండిఉంది. సుమారుగా జీవులన్నీ ప్రత్యక్ష, పరోక్షంగా సముద్రాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. సముద్రం సురక్షితంగా ఉంటేనే సకల జీవరాశులు బాగుంటాయి. సముద్రాలు సుమారు 50శాతం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయని, 30శాతం కంటే ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ను గ్రహిస్తాయని, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గిస్తాయని రుజువు చేశాయి. ఈ నేపథ్యంలో సముద్రపు జలాలు కలుషితం కాకుండా, జీవులు అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఆహ్లాదం కోసం తీరానికి వచ్చే వారు వ్యర్థాలను అక్కడ పడవేయవద్దు. దీనిపై విద్యార్థులకు, యువతకు అధికారులు అవగాహన కల్పించాలి. పరిశ్రమలు నేరుగా వ్యర్థ జలాలను విడిచిపెట్టకుండా చూడాలి. వాటిని శుద్ధి చేసి సముద్రంలోకి విడిచిపెట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.