Share News

The Same Problems ఈసారీ .. అవే సమస్యలా?

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:07 AM

The Same Problems Again This Time? ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన పాలకొండ కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు వేళయింది. ఈనెల 11 నుంచి వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అమ్మవారి దసరా ఉత్సవాలను తిలకించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ప్రధానంగా నిజరూప దర్శనం, విజయదశమి రోజు ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏటాలానే ఈసారి కూడా భక్తులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి.

The Same Problems   ఈసారీ .. అవే సమస్యలా?
దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

  • ఆదాయంలో మొదటి స్థానం..

  • వసతుల కల్పన అంతంతమాత్రం

  • రాష్ట్ర పండుగగా గుర్తించని వైనం

  • ఏటా తాత్కాలిక ఉత్సవ కమిటీలతోనే నిర్వహణ

  • భక్తులకు అవస్థలు తప్పేనా..!

పాలకొండ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరొందిన పాలకొండ కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు వేళయింది. ఈనెల 11 నుంచి వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అమ్మవారి దసరా ఉత్సవాలను తిలకించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్నారు. ప్రధానంగా నిజరూప దర్శనం, విజయదశమి రోజు ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏటాలానే ఈసారి కూడా భక్తులకు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానం ఆదాయంలో మొదటిస్థానంలో ఉన్నా.. భక్తులకు అవసరమైన వసతుల కల్పనలో మాత్రం వెనుకంజలో ఉంది. రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తించకపోవడం, తాత్కాలిక కమిటీలతోనే ఏటా ఉత్సవాలను నిర్వహిస్తుండడంతో భక్తజనానికి ఇక్కట్లు తప్పడం లేదు.

సమస్యల కొలువు...

కోటదుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు ఏటా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే వారికి అవసరమైన మౌలిక వసతులను సమ కూర్చలేకున్నారు. అమ్మవారి గుడికి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించి.. స్నానాలు ఆచరిం చేందుకు సరైనసౌకర్యం లేదు. మరుగుదొడ్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. తాగునీటి సరఫరా, ఇతర మౌలిక వసతులు కూడా అంతంతమాత్రమే.

ఆదాయం మెండుగా ఉన్నా...

కోటదుర్గమ్మకు ఏటా హుండీల ద్వారా రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల నేపఽథ్యంలో రోజూ వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఆ సమయంలో భక్తులు సమర్పించిన కానుకులు అధికంగానే ఉంటాయి. ఇప్పటికే అమ్మవారికి మూడుకిలోల బంగారం, 70 కిలోల వెండిని భక్తులు కానుకుల రూపంలో అందిం చారు. జిల్లాలోనే అత్యధిక ఆదాయం వస్తున్న ఆలయాల్లో కోటదుర్గమ్మ ఆలయం ఉంది.

తాత్కాలిక కమిటీలే దిక్కు...

గత కొన్నేళ్లుగా కోటదుర్గమ్మ ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో తాత్కాలిక కమిటీలతోనే నెట్టుకొస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఉత్సవ కమిటీల ఊసే ఎత్తలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ఉత్సవ కమిటీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే పాలకొండ దేవస్థానానికి సంబంధించి.. కూటమి నాయకుల మధ్య సమన్వయ లోపంతో ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో ఏటా దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో తాత్కాలిక కమిటీలను ఏర్పాటు చేసి మమా అనిపిస్తున్నారు.

రాష్ట్ర పండుగగా గుర్తిస్తే మరింత వైభవమే...

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ దసరా ఉత్సవాలను దశాబ్దాలుగా భక్తుల సహాయ సహకారాలతోనే ఎంతో వైభవంగా జరుగుతున్నారు. అయితే ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి.. ఆర్థికసహాయం అందిస్తే మరింత వైభవంగా ఉత్సవాలు జరిపించే అవకాశం కలుగుతుంది. కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి, విజయనగరం పైడితల్లి ఉత్సవాల మాదిరిగానే పాలకొండ కోటదుర్గమ్మ ఉత్సవాలను ప్రభుత్వం గుర్తించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

ఏర్పాట్లపై సబ్‌ కలెక్టర్‌ సమీక్ష

కోటదుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లుపై పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ముందుగా ఆలయ పరిసరాల్లో క్యూలైన్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, పారిశుధ్యం, విద్యుత్‌ సరఫరా, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత, వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఉత్సవాల సమయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవదాయశాఖ కమిషనర్‌ రాజారావు, డీస్పీ రాంబాబు, ఆలయ వో వి.వి.సూర్యనారాయణ, నగర పంచాయతీ కమిషనర్‌ నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

దసరా ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు

ఈ నెల 11 నుంచి కోటదుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరిపేందుకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. తాత్కాలిక కమిటీతోనే వేడుకలు జరుపుతున్నాం. భక్తులకు ఏ ఇబ్బందీ లేకుండా.. వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నాం.

- వీవీ సూర్యనారాయణ, ఆలయ ఈవో

Updated Date - Oct 10 , 2026 | 12:07 AM