The safety of devotees is important భక్తుల భద్రత ముఖ్యం
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:18 AM
The safety of devotees is importantమహాశివరాత్రి సమయంలో పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వారి భద్రతే ముఖ్యమని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి ఆదేశించారు.
భక్తుల భద్రత ముఖ్యం
పుణ్యగిరి వద్ద ఇబ్బందులు లేకుండా చూడాలి
క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి
శృంగవరపుకోట/నెల్లిమర్ల, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి):
మహాశివరాత్రి సమయంలో పుణ్యగిరి ఉమా కోటి లింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వారి భద్రతే ముఖ్యమని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. ఆలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. మెట్లపై నుంచి కొండపైకి నడిచి వెళ్లారు. క్యూలైన్‌లను పరిశీలించారు. పుట్టదార వద్ద భక్తల స్నానాల గురించి అడిగి తెలుసుకున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. కొండపై నుంచి భక్తులు కిందకు దిగేటప్పుడు రేగపుణ్యగిరి రోడ్డు నుంచి వచ్చేందుకు ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. దారిలోని పొదలను తొలగించాలని ఆదేశించారు. రెండు వైపులా కర్రలతో భద్రత కలిగిన రైయిలింగ్‌ను ఏర్పాటు చేయించాలని దేవదాయ శాఖ అధికారులకు సూచించారు.
- పుణ్యగిరి, రామతీర్థాలకు శివరాత్రి సమయంలో 50వేలకు పైబడి భక్తులు హాజరవుతారని, రద్దీకు అనుగుణంగా భద్రతను పెంచుతున్నామని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి చెప్పారు. ఏర్పాట్లు పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుణ్యగిరి కొండపైకి భక్తులంతా ఒకేసారి వెళ్లకుండా నియంత్రిస్తామని, విడతల వారీగా వెళ్లాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో దాట్ల కీర్తి, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష, తహసీల్దార్ డి.శ్రీనివాసరావు, ఎంపీడీవో సతీష్, పుణ్యగిరి ఉత్సవ కమిటీ చైర్మన్ పెదగాడ అప్పలరాజు ఉన్నారు.
రామతీర్థంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నెల్లిమర్ల మండలం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను కూడా కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణాన్ని, భక్తుల క్యూలైన్‌ను పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. సామాన్య భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తాగునీరు, నీడ, పారిశుధ్యం, పార్కింగ్, భద్రతాపరమైన అంశాల్లో ఎక్కడా రాజీపడకూడదని అధికారులను ఆదేశించారు. శివాలయాన్ని కూడా సందర్శించి క్యూలైన్లు పరిశీలించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీతారామస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. కలెక్టర్ వెంట ఆలయ ఈవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో కె.రామకృష్ణరాజు తదితరులు ఉన్నారు.