Share News

రైతుబజార్‌ను వినియోగించట్లే!

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:35 PM

సాలూరు పట్టణంలో లక్షల రూపాయలతో నిర్మించిన రైతుబజారు వినియోగానికి నోచుకోవడం లేదు.

రైతుబజార్‌ను వినియోగించట్లే!
నిరుపయోగంగా ఉన్న రైతు బజార్‌

- సాలూరులో 8 ఏళ్ల కిందట ఏర్పాటు

- అప్పటి ఎమ్మెల్సీ సంధ్యారాణి ప్రారంభం

- దూరం కావడంతో ఆసక్తి చూపని ప్రజలు

- కూరగాయల కొనుగోలుకు రాని వైనం

-రోడ్లపైనే విక్రయిస్తున్న వ్యాపారులు

- చేపలు, మాంసం విక్రయ కేంద్రంగా మార్చాలని విన్నపం

సాలూరులో ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన రైతుబజారు అది. అప్పటి ఎమ్మెల్సీ, ప్రస్తుత మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దీన్ని ప్రారంభించారు. పట్టణానికి దూరం కావడంతో ప్రజలు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తిచూపలేదు. దీంతో అది నిరుపయోగంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా దీన్ని పట్టించుకోలేదు. అప్పట్లో ప్రారంభించిన సంధ్యారాణి ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మంత్రిగా ఉన్నారు కూడా. ఏడాదిన్నర దాటినా ఈ రైతుబజారు వినియోగంలోకి రాలేదు. దీన్ని కనీసం చేపలు, మాంసం విక్రయ కేంద్రంగా మార్చాలని వ్యాపారులు విన్నవిస్తున్నారు.

సాలూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): సాలూరు పట్టణంలో లక్షల రూపాయలతో నిర్మించిన రైతుబజారు వినియోగానికి నోచుకోవడం లేదు. పట్టణానికి కొద్దిగా దూరంలో రైతుబజారు ఉండడంతో అటువైపు ప్రజలు కన్నెత్తి చూడడం లేదు. దీంతో వ్యాపారులు చేసేది లేక రోడ్లపైనే కూరగాయలను విక్రయించాల్సి వస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో సాలూరు పట్టణంలోని దండిగాం రోడ్డులో రూ.33 లక్షలతో రైతు బజార్‌ను నిర్మించారు. 2019 ఫిబ్రవరి 13న అప్పటి ఎమ్మెల్సీ గుమ్మిడి సంధ్యారాణి ఈ రైతు బజార్‌ను ప్రారంభించారు. వైసీపీ పాలనా కాలంలో పూర్తిస్థాయిలో పట్టించుకోకపోవడంతో ఇక్కడ కూరగాయల అమ్మకాలు, కొనుగోలు అసలు జరగలేదు. ఇప్పుడు ఈ స్థానం నుంచి అప్పట్లో ప్రారంభించిన గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికీ ఆ రైతుబజారు వినియోగంలేకి రాకపోవడంతో రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, మీసేవా కేంద్రం, చినబజార్‌తో పాటు ప్రధాన రహదారిపైనే కూరగాయల అమ్మకాలు సాగిస్తున్నారు. రైతుబజార్‌ వినియోగంలో లేకపోవడంతో సాలూరుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన అనేక మంది రైతులు చేసేది లేక వారు పండించిన పంటలను సమీపంలో ఉన్న రామభద్రపురంతో పాటు ఒడిశాకు తరలిస్తున్నారు. దీంతో ఎక్కువగా నష్టపోతున్నామని వాపోతున్నారు.

ఆసక్తి చూపని అమ్మకందారులు

పట్టణంలో అనేకచోట్ల కాయగూరలు విక్రయాల సాగుతుండడంతో రైతుబజార్‌ వద్దకు ఎవరూ రావడం లేదని అమ్మకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చి సరుకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదని, దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే తాము కూడా రైతుబజార్‌లో కాకుండా రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నామని అంటున్నారు. రైతు బజార్‌ను వినియోగంలోకి తేవాలని సాలూరు వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ సభ్యులు ఇటీవల తీర్మానం చేశారు. ఈమేరకు కార్యాచరణ చేస్తున్నా ఫలితం పెద్దగా ఉండడం లేదు. ప్రస్తుతం రైతుబజారు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. చీకటి పడితే చాలు మందుబాబులు పార్టీలు చేసుకుంటున్నారు.

మాంసం, చేపల విక్రయశాలగా మారిస్తే..

పట్టణంలోని కోట జంక్షన్‌, పెద్దబజార్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, మెయిన్‌రోడ్‌ ఇలా అనేక చోట్ల ఎలాంటి ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండా మాంసం, చేపల విక్రయాలు సాగుతున్నాయి. నిల్వ ఉంచిన చికెన్‌, మటన్‌ను వ్యాపారులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తూకంలో కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తూనికలు, కొలతలు శాఖ అధికారులు చేపట్టిన దాడుల్లో సుమారు 15మంది మాంసం, చేపల వ్యాపారులు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వాటిని విక్రయించకుండా రైతు బజార్‌ను మాంసం, చేపల విక్రయశాలగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు మునిసిపల్‌ పాలకవర్గం చర్యలు తీసుకోవాలని, ఆ అద్దెను మార్కెటింగ్‌ కమిటీకి అందజేస్తే రైతుబజార్‌ వినియోగంలోకి వచ్చినట్లు అవుతుందని అంటున్నారు.

కృషి చేస్తున్నాం..

రైతు బజార్‌ను వాడుకలోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగానే మార్కెటింగ్‌ కమిటీ సమావేశంలో తీర్మానం చేశాం. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.

సూర్యనారాయణ,వ్యవసాయ మార్కేటింగ్‌ కమిటీ చైర్మన్‌,సాలూరు.

Updated Date - Jan 20 , 2026 | 11:35 PM