ఆదివాసీల హక్కులను పరిరక్షించాలి
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:08 AM
ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కురుపాంలో గిరిజనులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు.
కురుపాంలో గిరిజనుల భారీ ర్యాలీ
కురుపాం, అక్టోబరు1(ఆంధ్రజ్యోతి): ఆదివాసుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కురుపాంలో గిరిజనులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సాయిబాబా గుడి నుంచి మెయిన్ రోడ్డు మీదుగా పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆరిక అశోక్ కుమార్ మాట్లాడుతూ.. గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించే జీవో నెంబరు 3 పునరుద్ధరించాలన్నారు. 1/70 చట్టం పటిష్టంగా అమలు చేసి గిరిజనేతరుల భూదురాక్రమణలను అరికట్టాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, ఉద్యోగ అవకాశాల్లో గిరిజనులకు రక్షణ కల్పించే విధానాలను బలోపేతం చేయాలన్నారు. అటవీ హక్కుల చట్టం ను సమర్ధవతంగా అమలు చేసి, తరతరాలుగా అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనునకు చట్టబద్ధమై హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మండంగి శ్రీనివాసరావు, నాయకులు కె.రమస్వామి, మండంగి రమణ, కూరంగి సీతారం, వ్యవసాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి గంగునాయుడు, గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.