Share News

అర్జీలను పరిష్కరించే బాధ్యత అధికారులదే

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:22 PM

పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను పరిష్కరించే బాధ్యతను అధికారులే తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు.

అర్జీలను పరిష్కరించే బాధ్యత అధికారులదే
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

- విజయనగరం కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను పరిష్కరించే బాధ్యతను అధికారులే తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. దీనికోసం ప్రతీరోజు అధికారులు కొంత సమయం కేటాయించి వారి పరిధిలోని కార్యాలయాల్లో అర్జీలపై సమీక్ష చేయాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడాలని, సరైన ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని అన్నారు. విజయనగరం బస్సు కాంప్లెక్స్‌లో పారిశుధ్యం, పరిశుభ్రత, తాగునీటి సదుపాయం అంశాల్లో ప్రజలు అసంతృప్తి కారణంగా జిల్లా ర్యాంకింగ్‌ నానాటికి దిగజారడం , రోడ్లపై గుంతలపై ప్రజా సానుకూలత తక్కువ కావడంపై కలెక్టర్‌ అధికారుల నుంచి వివరణ కోరారు. లోపాలు సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. యోగా కార్యక్రమంలో 3.91 లక్షల మంది పాల్గొనేలా రిజిస్ట్రేషన్‌ లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో జేసీ సేతు మాధవన్‌, డీఆర్‌వో సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 213 వినతులు

కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు వివిధ సమస్యలపై 213 వినతులు వచ్చాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 98, పంచాయతీరాజ్‌ 23, విద్యా శాఖ 16, మున్సిపల్‌ 9, విద్యుత్‌ శాఖ 7, గ్రామ సచివాలయం 4, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ 6, గృహ నిర్మాణ 2, ఇతర శాఖలకు సంబంధించి 31 వినతులు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి చందక సత్తిబాబు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్‌వో మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రతీ వినతిని నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రాధాన్యతతో పరిశీలించి వెంటనే డిస్పోజ్‌ చేయాలన్నారు. రెవెన్యూ అంశాలపై ప్రజలు ఎక్కువగా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో సంబంధించిన అధికారులు క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టి సమస్యలను త్వరితగతిని పరిష్కరించాలని అన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 11:22 PM