నెల రోజుల్లో ముస్తాబు పూర్తవ్వాలి
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:17 AM
జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముస్తాబు నెల రోజుల్లో పూర్తవ్వాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు.
జియ్యమ్మవలస, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ముస్తాబు నెల రోజుల్లో పూర్తవ్వాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. బుదవారం ఆర్‌ఆర్ బీ పురం పీహెచ్‌సీ ముస్తాబు కార్యక్రమానికి ప్రభుత్వ విప్ జగదీశ్వరి, జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్క వైద్యాధికారి మన ఆసుపత్రి - మన బాధ్యత అని ప్రజలతో మమేకమవ్వాలన్నారు. అంతే కాకుండా సంచి వైద్యు ల నుంచి, భూత వైద్యుల నుంచి ప్రజలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను సొంత కుటుంబ సభ్యుల్లా మాట్లాడి వైద్య సేవలు అందించాలన్నారు. రాష్ట్రంలో సహజ ప్రసవాల్లో జిల్లా ప్రఽథమ స్థానంలో ఉంచిన ప్రతీ ఒక్క వైద్యుడిని కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ విప్ జగదీశ్వరి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆసుపత్రులన్నింటిలో అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ బొంగు సురేష్ మాట్లాడుతూ జియ్యమ్మవలస పీహెచ్‌సీని ముస్తాబుతో ముందుంచుతానన్నారు. అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ కుదమ సబ్ సెంటర్‌ను ముస్తాబు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ భాస్కరరావు, పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.