‘రియల్’ మాఫియా!
ABN , Publish Date - May 30 , 2026 | 12:42 AM
- నెలకు రూ.2 వేలు ..60 నెలలు కడితే చాలూ. ప్లాట్ మీ సొంతం అవుతుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం అంటూ వచ్చిన ప్రకటన వారిని ఆకర్షించింది.
- నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు
- ఒక్కో స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్
- జిల్లాలో పెరుగుతున్న మోసాలు
- రాజాంలో రూ.60లక్షలు నష్టపోయిన బాధితులు
- అధికారులే న్యాయం చేయాలని వేడుకోలు
- నెలకు రూ.2 వేలు ..60 నెలలు కడితే చాలూ. ప్లాట్ మీ సొంతం అవుతుంది. సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఇదే మంచి అవకాశం అంటూ వచ్చిన ప్రకటన వారిని ఆకర్షించింది. వెనుకా ముందు చూసుకోకుండా.. వివరాలేవీ ఆరా తీయకుండా వంగర మండలం కొండచాకరాపల్లి గ్రామానికి చెందిన 50 మంది రూ.1.20 లక్షల చొప్పున రాజాంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి ముట్టజెప్పారు. మొత్తం రూ.60 లక్షలు కట్టగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి బోర్డు తిప్పేశాడు. మోసానికి గురయ్యామని తెలుసుకుని ఈ నెల 27 బాధితులంతా ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారు.
- రాజాం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఒక ప్లాట్‌ను రూ.3 లక్షలకు కొనుగోలు చేశాడు ఓ వ్యక్తి. విద్యుత్, కాలువలు, తాగునీరు వంటి సౌకర్యాలు ఉన్నాయంటూ నమ్మబలికిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్తిస్థాయి నగదు తీసుకున్నాడు. పది సంవత్సరాలు అవుతున్నా ఆ వెంచర్‌లో మౌలిక సదుపాయాలు కల్పించలేదు.
రాజాం, మే 29 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. అనుమతులు సులభతరం చేయడంతో కొత్తగా అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా స్థలాలను విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్న కేసులు సైతం అధికమవుతున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతులు తీసుకొని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రేరా)లో రిజిస్ట్రేషన్ కానివారు చాలా మంది ఉన్నారు. కొందరైతే ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా స్థలాలను విక్రయించేస్తున్నారు. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, రాజాంతో పాటు ఎస్.కోట, కొత్తవలసలో ఇటువంటి మోసాలు అధికంగా ఉన్నాయి.
అనుమతులు లేనివే ఎక్కువ..
నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ కార్యాలయాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరి నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని ఈఎంఐల రూపంలో సైతం మోసాలకు తెరలేపుతున్నారు. జిల్లాలో ఏటా 100 వరకూ రియల్ ఎస్టేట్ వెంచర్ల వేస్తుండగా.. అందులో సగానికిపైగా ప్రభుత్వ అనుమతులు లేనివే ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం సింగిల్ విండో తరహాలో అనుమతులు ఇస్తోంది. ఆపై రియల్ వెంచర్లలో రోడ్ల వెడల్పును 12 అడుగుల నుంచి 9 అడుగులకు తగ్గించింది. అయినా అక్రమ లేఅవుట్లకు అడ్డుకట్ట పడడం లేదు. చిరుద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకూ.. సాధారణ రైతు కూలీ నుంచి కార్మికుడు వరకూ.. చిరు వ్యాపారి నుంచి పెద్ద స్థాయి వ్యాపారి వరకూ తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని ఎక్కువగా ఇంటి స్థలాలపైనే పెడుతున్నారు. ఇటువంటి వారు కనీస నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద స్థలాలను కొనుగోలు చేస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిపై ఎటువంటి బ్యాంకు రుణాలు అందడం లేదు. పైగా ఒక్కో స్థలాన్ని ఇద్దరు ముగ్గురికి సైతం రిజిస్ర్టేషన్లు చేసి మోసం చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అందుకే రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..
వీటిని గమనించుకోవాలి..
- పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతి, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అఽథారిటీ (రేరా) రిజిస్ట్రేషన్లు చేసుకున్న లేఅవుట్లలోనే స్థలాలను కొనుగోలు చేయాలి.
- ప్లాట్లు విక్రయించే వ్యాపారుల నుంచి లేఅవుట్ నమూనా పత్రం తీసుకొని సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలోని ప్రణాళికా విభాగంలో సంప్రదించి నిర్ధారించుకోవాలి.
- రేరా వెబ్‌సైట్‌ను పరిశీలించడం ద్వారా ప్రాజెక్టుకు రిజిస్ర్టేషన్ ఉందో? లేదో? తెలుసుకోవచ్చు.
- కనీసం పదేళ్లకు సంబంధించి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ) తీసుకోవడం ద్వారా స్థలంపై బ్యాంకు రుణాలు, కేసులు ఉన్నాయా? లేదా? అనేది తెలుస్తుంది.
- లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సౌకర్యం ఇతర మౌలిక సదుపాయాలు పరిశీలించాలి.
- బ్యాంకింగ్ మార్గంలో డబ్బులు చెల్లించి రశీదు తీసుకోవాలి.
రెక్కల కష్టంతో కట్టాం..
నేను విశాఖలో కాయాకష్టం చేసుకొని నెలకు రూ.2,500 చొప్పున రాజాంలోని సాయి చైతన్య రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ సీర నారాయణరావుకు ఈఎంఐలు చెల్లించా. సొంతిల్లు కట్టుకోవచ్చని చెప్పి రూ.1.50 లక్షలు ముట్టజెప్పా. ఇప్పుడేమో నాకు కేటాయించిన ప్లాటు వేరొకరికి రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. అధికారులే మాకు న్యాయం చేయాలి.
- కర్రి ఉమామహేశ్వరరావు, బాధితుడు, కొండచాకరాపల్లి