The Power of Jaya Shanmukhi జయషణ్ముఖి సత్తా
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:09 AM
The Power of Jaya Shanmukhi నీట్ పరీక్షలో విజయనగరం జమ్మునారాయణపురం ప్రాంతానికి చెందిన రేలంగి జయషణ్ముఖి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం మార్కులు 720కి గాను 692 సాధించి 86వ ర్యాంకును చేజెక్కించుకున్నారు. రెండు వారాల కిందట వెలువడిన ఏసీ ఈఏపీ సెట్‌లోనూ అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు సాధించారు.
జయషణ్ముఖి సత్తా
నీట్‌లో 86వ ర్యాంకు
జిల్లా విద్యార్థులకు మెరుగైన ర్యాంకులు
గత నెల 21న పరీక్ష
తాజాగా ఫలితాలు విడుదల
విజయనగరం కలెక్టరేట్, జూలై 17(ఆంధ్రజ్యోతి):
నీట్ పరీక్షలో విజయనగరం జమ్మునారాయణపురం ప్రాంతానికి చెందిన రేలంగి జయషణ్ముఖి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం మార్కులు 720కి గాను 692 సాధించి 86వ ర్యాంకును చేజెక్కించుకున్నారు. రెండు వారాల కిందట వెలువడిన ఏసీ ఈఏపీ సెట్‌లోనూ అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు సాధించారు. వైద్యురాలు కావడమే తన లక్ష్యమని జయషణ్ముఖి చెబుతోంది. రోజుకు 12 గంటల పాటు నీట్ పరీక్ష కోసం చదివినట్లు తెలిపింది. తల్లిదండ్రుల పేర్లు రమోలా, శ్రీనివాసరావు. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నీట్‌లో ఎక్కువ మంది జిల్లా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. గత నెల 21న రీ-నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. జిల్లాలోని ఆరు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 1901 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1745 మంది రాశారు. 156 మంది విద్యార్థులు పరీక్షకు దూరంగా ఉండిపోయారు. గురువారం అర్ధరాత్రి విడుదలైన ఫలితాల్లో జిల్లా కేంద్రానికి చెందిన రేలంగి జయషణ్ముఖి జాతీయ స్థాయిలో 86వ ర్యాంకు సాధించారు.
- బొబ్బిలి మండలం కృష్ణాపురానికి చెందిన రెడ్డి రిషిత్ సూర్యకిరణ్‌కు 706 ర్యాంకు వచ్చింది. ఈయనకు 720 మార్కులకు గాను 665 మార్కులు వచ్చాయి. తల్లి సునీత జెన్‌కో ఇంజనీరుగా, తండ్రి ఆర్.సత్యనారాయణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు.
- విజయనగరం జిల్లా కేంద్రంలోని కంట్మోనెంట్‌కు చెందిన కొట్టాన సాయ భవ్య 970వ ర్యాంకు సాధించారు. తండ్రి తేజేశ్వరరావు గాజులరేగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. తల్లి పూసపాటిరేగ మండలం వ్యవసాయ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
జశ్వంత్‌నాయుడుకు 624వ ర్యాంకు
బొబ్బిలి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని బోస్‌నగర్ (మిలటరీ కాలనీ) ప్లై ఓవర్ బ్రిడ్జి తూర్పు భాగంలో నివాసం ఉంటున్న శంబంగి జశ్వంత్‌నాయుడు నీట్‌లో 624వ ర్యాంకు సాధించాడు. మొత్తం మార్కులు 720కి గాను 667 వచ్చాయి. ఇటీవల విడుదలైన ఈఏపీసెట్‌లో స్టేట్ ఫస్ట్‌ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. స్వగ్రామం బొబ్బిలి మండలం పక్కి. తండ్రి పార్వతీపురం విద్యుత్ డివిజన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తల్లి తెంటు శ్రీదేవి పార్వతీపురం మన్యం జిల్లా లచ్చయ్యపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఈఏపీసెట్‌లో జశ్వంత్‌నాయుడుకు 144.53 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమంగా నిలిచాడు.
న్యూరాలజిస్ట్‌గా సేవలందించాలన్నది లక్ష్యం: జశ్వంత్‌నాయుడు
ఢిల్లీ ఎయిమ్స్‌లో మెడిసిన్ సీటు సాధించగలనన్న నమ్మకం ఉంది. న్యూరాలజిస్ట్‌గా సమాజానికి సేవలందించాలన్నది నా ఆకాంక్ష. ఆ లక్ష్యంతోనే కష్టపడి చదివాను. రోజుకు 18 నుంచి 20 గంటలపాటు శ్రమించాను. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది.
ధీరజ్‌నాయుడుకు 2566వ ర్యాంకు
రాజాం/రేగిడి, జూలై 17(ఆంధ్రజ్యోతి): నీట్ ఫలితాల్లో రాజాంకు చెందిన దన్నాన ధీరజ్‌నాయుడు ఆల్ ఇండియా స్థాయిలో 2566వ ర్యాంకు సాధించాడు. తండ్రి రామారావు కాగితాపల్లి యూపీ పాటశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా తల్లి కిమిడి గౌరి రేగిడి మండలం చిన్నయ్యపేటలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరు రాజాంలో ఉంటున్నారు. స్వగ్రామం రేగిడి మండలం బొడ్డవలస.
- రాజాంకు చెందిన లాభాన ప్రనిత నీట్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 52693వ ర్యాంకు సాధించింది. తండ్రి వేణుగోపాల్ డోలపేట హైస్కూల్‌లో ఉపాధ్యాయినిగా, తల్లి ఉత్తరావల్లి సుజాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు.
చక్రధర్‌కు 6,457వ ర్యాంకు
రామభద్రపురం, జూలై 17(ఆంధ్రజ్యోతి): రామభద్రపురం మండల కేంద్రానికి చెందిన చొక్కాపు చక్రధర్ నీట్‌లో ఆలిండియాలో 6,457వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు ప్రసాద్, పార్వతిలు వ్యవసాయంచేస్తూ జీవనం సాగిస్తున్నారు.
గాయత్రీప్రియకు 6572వ ర్యాంకు
బొబ్బిలి రూరల్, జూలై 17(ఆంధ్రజ్యోతి): న్యూ జగన్నాథపురం టీచర్స్ కాలనీకి చెందిన పెద్దింటి గాయత్రీప్రియ శుక్రవారం విడుదలైన నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 6572వ ర్యాంకు సాధించారు. తండ్రి శ్రీనివాస మోహనరావు టీజీటీ ఉపాధ్యాయుడుగా పనిచేస్తుండగా.. తల్లి అమ్మడమ్మ గృహిణి.