Share News

ప్లాస్టిక్‌ ముప్పు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:52 PM

జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం కానరావడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది.

 ప్లాస్టిక్‌ ముప్పు
కేల్‌పురంలోని ఆర్టీవో కార్యాలయం ఎదురుగా గుట్టలా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

- జిల్లాలో యథేచ్ఛగా విక్రయాలు

- విచ్చలవిడిగా వినియోగం

- అమలుకాని నిషేధం

- తనిఖీల ఊసెత్తని అధికారులు

విజయనగరం టౌన్‌, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్లాస్టిక్‌ నిషేధం కానరావడం లేదు. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. నిత్యావసర సరుకులు, చికెన్‌, మటన్‌, కూరగాయలు, పాలు, టిఫిన్‌, పండ్లు ఇలా ఏ వస్తువు కొనుగోలు చేసినా ప్లాస్టిక్‌ కవర్లలోనే వ్యాపారులు ఇస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే దర్శనమిస్తోన్నాయి. విజయనరం కార్పొరేషన్‌ పరిధిలో మూడు లక్షల జనాభా ఉన్నారు. ప్రతిరోజూ 125 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఇందులో నిషేధిత ప్లాస్టిక్‌ ఉత్పత్తులే అధికంగా ఉంటున్నాయి. నగరంలోని ప్రధాన మార్కెట్లు, హోల్‌సేల్‌ షాపుల నుంచి రహదారులపై తోపుడు బళ్లపై వ్యాపారాలు చేసేవారి వరకూ ప్లాస్టిక్‌ కవర్లు లేనిదే పని జరగడం లేదు. విజయనగరం పట్టణంలో నిషేధం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. నెలవారీ మామూళ్లు అందుతుండడంతో అటువైపు చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రకటనలకే పరిమితం

ప్లాస్టిక్‌ కవర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని, వాటిని విక్రయిస్తే జరిమానా విధిస్తామని అధికారులు చెబుతున్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. వీటిని విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పర్యావరణానికి ప్లాస్టిక్‌ పెనుముప్పు అని తెలిసినా ప్రజలు ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్‌, పాలిథిన్‌ కవర్లను ఉపయోగించిన తరువాత వాటిని ఎక్కడ పడితే అక్కడే పడేస్తుండడంతో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు గత రెండేళ్లుగా నిద్దరోడుతున్నట్టు విమర్శలు ఉన్నాయి. దీంతో ప్రజల్లో కూడా మార్పు రావడం లేదు.

నిషేధం ఉన్నా ఆగట్లే..

సింగిల్‌ యూజ్‌ ఉత్పత్తులను మూడేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కానీ, అది ఎక్కడా అమలు కావడం లేదు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్‌ గ్లాసులు, కవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి భూమిలో కలసిపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా వాటిని వినియోగించడం లేదు. ప్లాస్టిక్‌తో పోల్చుకుంటే వీటి ధర ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తక్కువ రేటుకు లభించే పాలథిన్‌ వైపే వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. అల్పాహార, మాంసాహార హోటళ్లు, ఫుట్‌పాత్‌, టీ దుకాణాల్లో వేడి టీ, కాఫీ, పాలు, కూరలను పాలిథిన్‌ సంచుల్లో పార్శిల్‌ చేస్తున్నారు. వినియోగదారులు కూడా వీటితోనే తీసుకువెళ్తున్నారు. ఈ పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్‌, జీర్ణకోశ సంబంధిత వ్యాధుల బారిన పడతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాస్టిక్‌ నిషేధంపై యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిన అవసరంఉంది.

ఇవీ నిబంధనలు..

- 120 మైక్రాన్లు కంటే ఎక్కువ మందం ఉన్న పాలిథిన్‌ కవర్లను మాత్రమే వినియోగించాలి.

- ఆ లోపు ఉన్నవి పూర్తిగా వినియోగించకూడదు.

- నార (జూట్‌), కాగితం, క్లాత్‌తో చేసిన సంచులను మాత్రమే తయారు చేసి వ్యాపారులు విక్రయించాలి.

- వారపు సంతలు, కూరగాయలు, కిరాణా, ఇతర దుకాణాల్లో వీటిని అందుబాటులో ఉంచాలి.

-పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లను అనుమతించరాదు.

- ప్రతీ పర్యాటక ప్రాంతంలో ప్లాస్టిక్‌ నిషేధం బోర్డులను ఏర్పాటు చేయాలి

- నిబంధనలు పాటించని వ్యాపారులు, వినియోగదారుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలి.

తనిఖీలు చేపడతాం

నగరంలో ప్లాస్టిక్‌ విక్రయాలు చేపట్టే దుకాణాలపై దాడులు చేస్తాం. స్వర్ణవార్డు సిబ్బందితో కలసి తనిఖీలు చేస్తాం. ఇప్పటికే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్‌, కమిషనర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నారు. పైడితల్లి అమ్మవారి పండగ తరువాత ప్లాస్టిక్‌ నిషేధంపై పూర్తిస్థాయి దృష్టి పెడతాం.

-వెంకట్‌, ఎన్విరాల్‌మెంట్‌ అధికారి, ప్రజారోగ్యశాఖ, విజయనగరం

Updated Date - Oct 06 , 2026 | 11:52 PM