Share News

మానవత్వం చాటిన బొబ్బిలి వాసులు

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:02 AM

ప్రమాదానికి గురైన బిచ్చగాడిపై బొబ్బిలివాసులు మానవత్వం చాటారు. ఆయనకు శస్త్రచికిత్స చేయించి, స్వరాష్ట్రం కేరళకు రైలుపై అతడికి బుధవారం సాగనంపారు.

మానవత్వం చాటిన బొబ్బిలి వాసులు
బిచ్చగాడికి సాగనంపుతున్న బొబ్బిలి వాసులు

బొబ్బిలి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రమాదానికి గురైన బిచ్చగాడిపై బొబ్బిలివాసులు మానవత్వం చాటారు. ఆయనకు శస్త్రచికిత్స చేయించి, స్వరాష్ట్రం కేరళకు రైలుపై అతడికి బుధవారం సాగనంపారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కేరళలోని పాల్కాడ్‌ ప్రాంతానికి చెందిన చక్రపాణి 20 ఏళ్ల కిందట బొబ్బిలి చేరుకుని దేవాలయాల వద్ద బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఆయనకు మూడు నెలల క్రితం ప్రమాదం జరగడంతో కాలి మక్క దగ్గర ఎముక విరిగింది. నడవలేని పరిస్థితిలో దయనీయంగా ఉన్న విషయాన్ని స్ధానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆయనకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పడంతో కారుణ్య ఫౌండేషన్‌ చైర్మన్‌ జేసీ రాజు అందుకోసం ముందుకొచ్చారు. చక్రపాణికి శస్త్రచికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే బేబీనాయన, సత్యసాయి భక్తమండలి, వర్తకులు, ముస్లిం ప్రతినిధులు, వ్యాపారవేత్త సుంకర సాయి తదితరులు రూ.65 వేలు విరాళాలు అందించారు. 20 రోజుల కిందట బొబ్బిలి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. ఆయన నడవగలిగే స్థితికి చేరుకున్నాడు. అతడిని ఏదైనా అనాఽథాశ్రమంలో చేర్పించేందుకు జేసీ రాజు ప్రయత్నం చేశారు. అందుకు చక్రపాణి నిరాకరించాడు. కేరళ వెళ్లిపోతానని చెప్పడంతో అతడిని రైలులో బుధవారం సాయంత్రం సాగనంపారు. ఈ సందర్భంగా చక్రపాణి అందరికీ అశ్రునయనాలతో కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 05 , 2026 | 12:02 AM