The patient should go home with a smile రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:14 AM
The patient should go home with a smile ప్రభుత్వ ఆసుపత్రికి బాధతో వచ్చే రోగి తిరిగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలని, వారికి సాంత్వన కలిగిలా వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, కలెక్టర్ రామసుందర్ రెడ్డితో కలసి సోమవారం ఉదయం శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నూతన భవనంతో పాటు పీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలి
రోగుల వివరాలను యాప్‌లో నమోదు చేయాలి
కిడ్నీ వ్యాధి బాధితులను అదుకొనేందుకే డయాలసిస్ కేంద్రాలు
అభివృద్ధి పనులను సాధించడంలో ఎమ్మెల్యే లలితకుమారి ఆదర్శం
ఎస్.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
శృంగవరపుకోట, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ ఆసుపత్రికి బాధతో వచ్చే రోగి తిరిగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లాలని, వారికి సాంత్వన కలిగిలా వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, కలెక్టర్ రామసుందర్ రెడ్డితో కలసి సోమవారం ఉదయం శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి నూతన భవనంతో పాటు పీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ క్యాన్సర్, మూత్రపిండాలు, గుండెపోటు వంటి పది రకాల వ్యాధులను గుర్తించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నామని, ఆసుపత్రులకు వచ్చే రోగుల వివరాలను ఆయుష్మాన్ భారత్ యాప్‌లో నమోదు చేయాలని వైద్యులకు సూచించారు. తద్వారా ఐడీ నెంబర్ కొట్టగానే ప్రతిఒక్కరి ఆరోగ్య సమాచారమంతా తెలుసుకోవచ్చన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్థులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.13కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలోనే రూ.168 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ పోగ్రం కింద రాష్ట్రంలో 15 డయాలసిస్ కేంద్రాలను పిపి పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
- ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అభివృద్ధి పనులకు నిధుల కోసం బాబ్బాబూ అంటూ బతిమాలుతూ అడుగుతారని మంత్రి సత్యకుమార్ యాదవ్ చమత్కరించారు. ఒక అభివృద్ధి పని అయిపోగానే మరో అభివృద్ధి పనికోసం వరుస కడతారన్నారు. ‘మా రాయలసీమలో దబాయించి అడిగేతత్వం ఉండడంతో నిధులు సాధించడం అప్పుడప్పుడు కష్టమవుతుందని, మీ ఎమ్మెల్యేలా సౌమ్యంగా అడిగితే ఎలాంటి వారైనా పని చేస్తార’ని అన్నారు.
ఐదేళ్లపాటు వదిలేసిన వైసీపీ
జిల్లాలో స్థాయి పెరిగిన ప్రభుత్వ ఆసుపత్రుల భవనాలను ఐదేళ్ల పాటు నిర్మించకుండా గత వైసీపీ పాలకులు వదిలేశారని మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయానికి గజపతినగరం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి భవనాలు 50శాతం కూడా జరగలేదన్నారు. మనసు పెట్టి పనిచేస్తే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా పనులు పూర్తి చేయించవచ్చునన్నారు. వైసీపీ బిల్లులు చెల్లించకుండా వదిలేసిన కాంట్రాక్టర్లకు కొద్దికొద్దిగా బిల్లులు చెల్లిస్తూ వారిని ఒప్పించి నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నామన్నారు.
- ప్రధాన మంత్రి నేషనల్ పోగ్రాం కింద డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనులు, పేద ప్రజలు డయాలసిస్ కోసం విశాఖ వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఇక్కడే ఐదు పడకలతో డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి రావడంతో ఆర్థిక వెసులుబాటు ఉంటుందన్నారు.
- కార్యక్రమంలో రాష్ట్ర దాసరి సంక్షేమ సంఘం చైర్మన్ పొట్నూరు రత్నాజీ, డైరెక్టర్ నానిగిరి రమణాజీ, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి, కూటమి నాయకులు కేబీఏ రామప్రసాద్, ఒబ్బిన సత్యనారాయణ, రెడ్డి పావని, రాకేష్ వర్మ, డోకుల అచ్చం నాయుడు, కరెండ్ల ఈశ్వరరావు, చోక్కాకుల మల్లునాయుడు, జీఎస్ నాయుడు, రెడ్డి వెంకన్న, రాయవరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం
మంత్రి సత్యకుమార్ యాదవ్
గజపతినగరం, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహాయ, సహకారాలతో ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రూ.17 కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకున్న వంద పడకల ప్రభుత్వప్రాంతీయ ఆసుపత్రిని సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్ మాట్లాడుతూ ఆరోగ్య శాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవా ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.25లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామన్నారు. ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఆరోగ్యవంతంగా చూసేలా సంజీవిని అనే కార్యక్రమం తీసుకువస్తున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో అత్యధికంగా క్యాన్సర్ రోగులు ఉన్నారని, రాష్ట్రంలో మొదటి స్థానం కాకినాడ కాగా రెండో స్థానంలో విజయనగరం జిల్లా ఉందన్నారు. ఈ నేపథ్యంలో మరింతగా వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వంద పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా జరిగేందుకు మంత్రి సత్యకుమార్ అపూర్వ సహకారం అందించారని చెప్పారు. డయాలసిస్ కేంద్రాన్ని కూడా మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు, కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి జీవనరాణి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, బీజేపీ జిల్లా అద్యక్షుడు రాజేష్ శర్మ, ఏఎంసీ చైర్మన్ వీవీవీ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.