మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:04 AM
: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు హెచ్చరించారు.
-నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
-రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు
- రేషన్ డీలర్‌కు నోటీసులు
సీతంపేట రూరల్,జనవరి 8(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు హెచ్చరించారు. సీతంపేట ఏజెన్సీలో గురువారం ఆయన పర్యటించారు. పలు పాఠశాలలు, అంగ్‌వాడీ కేంద్రాలు, జీసీసీ డీఆర్ డిపోలను పరిశీలించారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు వడ్డించిన అన్నం సరిగ్గా ఉడకకపోవడాన్ని గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హడ్డుబంగి ఆశ్రమ, సీతంపేట గురుకుల పాఠశాలలను సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. సీతంపేట అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా అయిన కోడిగుడ్ల బరువులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. జామితోట అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. గొయిది, హడ్డుబంగి గ్రామాల్లోని జీసీసీ డీఆర్ డిపోలను పరిశీలించారు. స్టాక్ రికార్డులను సరిగా లేకపోవడంతో డీలర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు నోటీసులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ మేనేజర్ చిన్నకృష్ణ, సీఎస్‌డీటీలు రమేష్, సన్యాసిరావు, విద్యాశాఖ ఏడీ రామజ్యోతి, జీసీడీవో భారతి, ఎంఈవో ఆనందరావు, ఫుడ్‌సేఫ్టీ అధికారి వినోద్‌కుమార్, ఐసీడీఎస్ అధికారులు ఉన్నారు.