The measurements are wrong కొలతల్లో కనికట్టు!
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:56 PM
The measurements are eye-catching! తూనికల్లో మోసాలకు కొదువ లేదు. కూరగాయాలు, పండ్లు, నిత్యావసరాల కొనుగోలు సమయంలో బరువు తేడా ఉండడం నిత్యం గమనిస్తుంటాం. తూకాల్లో మోసం జరుగుతుండగా కల్తీ కూడా రాజ్యమేలుతోంది. ఇవి కట్టడి కాకపోగా ఏటా పెరుగుతున్నాయి. వినియోగదారుల్లో అవగాహనలోపం.. అధికారుల్లో నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి మారడం లేదు. నిఘా పెట్టాల్సిన తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత కూడా ఓ కారణం.
కొలతల్లో కనికట్టు!
వస్తు క్రయ విక్రయాల్లో మోసాలు
అన్ని వ్యాపారాల్లోనూ ఇదే తీరు
ఫిర్యాదు వచ్చినప్పుడే తనిఖీలు
హెచ్చరించి.. మామూలు తీసుకుని వదిలేస్తున్న వైనం
నిఘా పెట్టాల్సిన తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత
జిల్లా అంతటికీ ఇన్‌స్పెక్టర్ ఒకరే
తూనికల్లో మోసాలకు కొదువ లేదు. కూరగాయాలు, పండ్లు, నిత్యావసరాల కొనుగోలు సమయంలో బరువు తేడా ఉండడం నిత్యం గమనిస్తుంటాం. తూకాల్లో మోసం జరుగుతుండగా కల్తీ కూడా రాజ్యమేలుతోంది. ఇవి కట్టడి కాకపోగా ఏటా పెరుగుతున్నాయి. వినియోగదారుల్లో అవగాహనలోపం.. అధికారుల్లో నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి మారడం లేదు. నిఘా పెట్టాల్సిన తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత కూడా ఓ కారణం.
రాజాం, జనవరి 8(ఆంధ్రజ్యోతి):
మార్కెట్‌లో అనేక రకాల వ్యాపారాలు జరుగుతుంటాయి. పెట్రోల్ బంక్‌లు, ఎంఎస్‌ఎల్ పాయింట్లు, బులియన్ మార్కెట్, హోల్‌సేల్, చిల్లర దుకాణాలు, మాల్స్, సిమెంట్, ఇనుప సామగ్రి, కూరగాయలు తదితర దుకాణాలు నడుస్తున్నాయి. వీటిని నిర్వహించే వ్యాపారులు తమ కాటాలు, ఎలక్ర్టానిక్ వేయింగ్ మిషన్లను ఏడాదికోసారి.. మాన్యువల్స్ కాటాలైతే రెండేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలి. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదన్న విమర్శలున్నాయి. అటు ఆ శాఖకు సిబ్బంది కొరత వెంటాడుతోంది. జిల్లాలో విజయనగరం, బొబ్బిలిలో ఆ శాఖకు కార్యాలయాలున్నాయి. విజయనగరంలో మాత్రమే ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. బొబ్బిలిలో కార్యాలయంలో ఏడు నెలలుగా ఆ పోస్టు ఖాళీగా ఉంది. వాణిజ్య, వర్తక కేంద్రంగా ఉన్న రాజాంలో తూనికలు, కొలతల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని వ్యాపారులు కోరుతున్నా ఫలితం లేకపోతోంది. గత ఎనిమిది నెలల కాలంలో విజయనగరం కార్యాలయం పరిధిలో 500 కేసులు నమోదయ్యాయి. రూ.25,16,304 అపరాధ రుసుం వసూలు చేశారు. బొబ్బిలి పరిధిలో 246 కేసులు నమోదుకాగా..రూ.13.77 లక్షలు అపరాధ రుసుం కింద వసూలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ట్యాంపరింగ్..
కొందరు వ్యాపారులు ఎలక్ర్టికల్ వేయింగ్ మిషన్లలో ట్యాంపరింగ్ చేసి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. నియంత్రించాల్సిన తూనికలు కొలతల శాఖ తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమవుతోంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో ఎక్కువగా మోసం జరుగుతోంది. ఎలక్ర్టికల్ వేయింగ్ మిషన్లలో ట్యాంపరింగ్ చేస్తున్నారు. లీటరు పెట్రోల్‌కు 100, 200 వరకూ మిల్లీ లీటర్లు పక్కదారి పట్టిస్తున్నారు. బంకుల వద్ద కనీస నిబంధనలు పాటించడం లేదు. ఏరోజుకారోజు బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ ధరలను ప్రదర్శించాలి. ఇది ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. పెట్రోల్ నాణ్యత తెలుసుకునేందుకు బంకుల వద్ద ఫిల్టర్ పేపర్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఆ పేపరుపై రెండు మూడు చుక్కలు పెట్రోల్ వేస్తే అది ఆవిరి అయిపోతే నాణ్యత గల పెట్రోల్‌గా పరిగణించవచ్చు. మరకలుగా మిగిలిపోతే కల్తీ జరిగినట్టు నిర్థారించవచ్చు.
గృహ నిర్మాణ సామగ్రిలో కూడా..
చివరికి గృహ నిర్మాణ సామగ్రి అమ్మకాల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. 25 కేజీల సిమెంట్ బస్తా వద్ద కేజీ, కేజీన్నర తరుగు వస్తోంది. కంపెనీలు నిబంధనలు పాటిస్తున్నా కొంతమంది దళారులు బస్తాల్లో సిమెంట్ తీసి రీ ప్యాకింగ్ చేస్తున్నారు. ఇనుము కేజీలెక్క విక్రయించాల్సి ఉన్నా జిల్లాలో చాలామంది వ్యాపారులు విడి పరికరాల కింద అమ్ముతున్నారు.
వంట గ్యాస్‌లో..
వంట గ్యాస్‌లో కూడా మోసం పెరుగుతోంది. కొన్ని ఏజెన్సీలు ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ కాకుండా డెలివరీ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్‌లో కూడా నిర్ణీత ప్రమాణం తగ్గుముఖం పడుతోంది. చాలామంది బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసినప్పుడు వ్యత్యాసం కనిపిస్తోంది. ఒక్కో సిలిండర్ వద్ద రెండు కిలోల వరకూ తగ్గుముఖం పడుతోంది. డెలివరీ బాయ్స్ కూడా కొంత అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
నిత్యావసరాలు, ఆహార పదార్థాల గురించి చెప్పనక్కర్లేదు. నాణ్యతలోను, తూనికల్లోనూ మోసమే కనిపిస్తోంది. కిరాణా దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ ట్యాంపరింగ్ చేసి విక్రయిస్తున్నారు. కొన్నింటికి ప్రామాణిక ముద్రతో విక్రయించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా లూజు విక్రయాలు చేస్తున్నారు. వంట నూనెలో కూడా కల్తీ జరుగుతోంది. ప్రధానంగా వారపు సంతల్లో తూనిక రాళ్లతో విక్రయిస్తున్నారు.
దృష్టిసారించాం
తూనికలు, కొలతలపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. ఎక్కడైనా మోసాలు జరిగితే వెంటనే ఫిర్యాదుచేయాలి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నాం. వ్యాపార సంస్థలు నిర్ణీత ప్రమాణాలు పాటించాలి. లేకుంటే చర్యలు తప్పవు. సిబ్బంది కొరత ఉన్నా ఉన్నంతలో తనిఖీలు చేపడుతున్నాం. అవసరమైతే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. రాజాంలో ఎన్ని సార్లు దాడులు నిర్వహించినా వ్యాపారులలో మార్పులు రాలేదు, ఎటువంటి తేడాలు కనిపించినా వారిపై కేసులు నమోదు చేస్తాం, ఎంతటి వారు అయినా విడిసిపెట్టేదిలేదు,
- మనోహర్, తూనికలు కొలతల శాఖ డిప్యూటీ కమిషనర్, విజయనగరం