Share News

కనిపించని ‘ప్రత్యేకం’!

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:39 AM

పంచాయతీల వైపు ప్రత్యేకాధికారులు కన్నెత్తిచూడడం లేదు. వారానికి ఒకటిసారి కూడా గ్రామాల వైపు రావడం లేదు.

   కనిపించని ‘ప్రత్యేకం’!
రాజాం మండలం నందబలగ గ్రామంలో ఇలా

- పంచాయతీల ముఖం చూడని ప్రత్యేకాధికారులు

- గ్రామాల్లో అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం

- ప్రజలకు తప్పని ఇబ్బందులు

-రాజాం మండలం నందబలగ -గ్రామంలో పారిశుధ్యం పరిస్థితి ఇది. గత కొద్దిరోజులుగా పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో ఇలా వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో గ్రామస్థులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజాం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల వైపు ప్రత్యేకాధికారులు కన్నెత్తిచూడడం లేదు. వారానికి ఒకటిసారి కూడా గ్రామాల వైపు రావడం లేదు. దీంతో జిల్లాలోని చాలా గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. వీధుల్లో చెత్తాచెదారం నిల్వలు పేరుకుపోతున్నాయి. మురుగు కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో కంపు కొడుతున్నాయి. తాగునీరు, వీధి దీపాలు వంటి విషయంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం గడువు ఈ ఏడాది ఏప్రిల్‌ 2తో ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. వారు దృష్టిపెట్టకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 777 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ ఎంపీడీవోలు, డిప్యూటీ తహసీల్దార్లు, ఈవోపీఆర్డీలు, సీనియర్‌ అసిస్టెంట్లు, ఇంజనీర్లు...ఇలా మండల కీలక అధికారులు పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల ఒకే అధికారికి రెండు పంచాయతీల చొప్పున బాధ్యతలు కట్టబెట్టారు. అటు మాతృశాఖతో పాటు ఇటు ప్రత్యేక బాధ్యతలు చూడలేక చాలామంది అధికారులు సతమతం అవుతున్నారు.

క్లిష్ట సమయం..

ప్రస్తుతం తుఫాన్‌ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. వ్యాధులు ముసిరే సమయం ఇది. ఈ సమయంలో పారిశుధ్యానికి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అటువంటిది ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన పంచాయతీల ముఖం చూడడం లేదు. అక్కడున్న వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతోనే పని కానిచ్చేస్తున్నారు. మండల కేంద్రాలకు దగ్గరగా ఉన్న పంచాయతీలైతే ఫర్వాలేదు. వారానికి ఒకసారి వచ్చి పోతున్నారు. దూరంగా ఉండే పంచాయతీల విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. పల్లె ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

దృష్టిపెట్టాల్సిందే..

పంచాయతీలపై ప్రత్యేకాధికారులు దృష్టిపెట్టాల్సిందే. ఇప్పటికే దీనిపై స్పష్టమైన ఆదేశాలిచ్చాం. పారిశుధ్యంతో పాటు తాగునీటి సమస్యపై దృష్టిపెట్టాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు. పారిశుధ్యం, తాగునీరు, వీధిలైట్లు విషయంలో చొరవచూపాలి.

-హేమసుందరరావు, జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం

Updated Date - Sep 26 , 2026 | 12:39 AM