The husband killed her. భర్తే చంపేశాడు
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:26 AM
The husband killed her. రాజాంలోని కొండంపేటకు చెందిన గుడివాడ లలితకుమారిని భర్తే దారుణంగా హతమార్చాడు. అనుమానంతోనే ఇందుకు తెగబడ్డాడు. ముందస్తు ప్రణాళికతో కొనుగోలు చేసిన గొడ్డలితో ఆమెను కిరాతకంగా నరికి చంపినట్లు టౌన్ సీఐ నవీన్ సోమవారం తెలిపారు.
భర్తే చంపేశాడు
అనుమానంతోనే దారుణంగా హత్య
ముందస్తు ప్రణాళికతో గొడ్డలి కొనుగోలు
కొండంపేట ఘటన వివరాలు వెల్లడించిన సీఐ
రాజాం రూరల్, అక్టోబరు 26(ఆంరఽధజ్యోతి): రాజాంలోని కొండంపేటకు చెందిన గుడివాడ లలితకుమారిని భర్తే దారుణంగా హతమార్చాడు. అనుమానంతోనే ఇందుకు తెగబడ్డాడు. ముందస్తు ప్రణాళికతో కొనుగోలు చేసిన గొడ్డలితో ఆమెను కిరాతకంగా నరికి చంపినట్లు టౌన్ సీఐ నవీన్ సోమవారం తెలిపారు. భార్యను హత్యచేసి ఆపై ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయి ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించాడని స్పష్టం చేశారు. రాజాం టౌన్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
గుడివాడ లలితకుమారికి రాజాం కొండపేటకు చెందిన సీతారామరాజుతో 23 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత భార్యను రాజాంలోని ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదివించాడు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తయ్యాక ఆమె అదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. కొన్నాళ్లు అక్కడి పనిచేశాక 2017లో ట్రాన్స్‌కోలో ఆమె ఉద్యోగం సాధించి పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో పనిచేశారు. విధినిర్వహణలో ఆమె సహచరులతో స్నేహంగా ఉండడం, విధుల నుంచి ఇంటికి ఆలస్యంగా రావడంతో ఆమెపై తొలినాళ్ల నుంచి భర్త అనుమానం పెంచుకుంటూ వచ్చాడు. కొన్నాళ్ల తరువాత లలితకు వీరఘట్టం నుంచి రాజాం ట్రాన్స్‌కో కార్యాలయానికి బదిలీ అయింది. గొడవలు మాత్రం తగ్గలేదు. పలుమార్లు ఆమెను వేధించడం, కొట్టడంతో భర్త వేధింపులు తట్టుకోలేక లలిత విశాఖ జిల్లా గోపాలపట్నంలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి రెండుమూడు రోజులు ఉండిపోయేది. ఆమెకు ఇటీవల రాజాం నుంచి చీపురుపల్లికి బదిలీ అయింది. పిల్లలిద్దరు హాస్టల్‌లో ఉంటున్నారు. ఆమెపై మరింత కక్ష పెంచుకున్న సీతారామరాజు కొన్నాళ్లుగా భార్యను అంతమొందించాలన్న ఆలోచనతో ఉన్నాడు. గొడ్డలి కొనుగోలు చేసి ఇంట్లో దాచాడు.
- ఈనెల 24న రాత్రి భార్యభర్తల మధ్య మరోసారి గొడవ చోటుచేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లిపోతుందన్న ఆలోచనతో ఇంట్లో భద్రపరిచిన గొడ్డలిని కొండంపేట నుంచి రాజాం వెళ్లే మార్గంలో పొదల్లో దాచిపెట్టాడు. ఆదివారం వేకువజామున సుమారు నాలుగు గంటల సమయంలో ఆమె ట్రాలీబ్యాగ్‌లో దుస్తులు సర్దుకుని తల్లిదండ్రుల వద్దకు బయలుదేరింది. తాను కాంప్లెక్స్ వద్దకు డ్రాప్ చేస్తానని భార్యకు నమ్మబలికి స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. గ్రామం దాటాక ముందురోజు రాత్రి గొడ్డలి భద్రపరిచిన ప్రదేశం వద్ద స్కూటీని ఆపి ఆమెతో మరోసారి వాగ్వాదానికి దిగి అక్కడే దాచి ఉంచిన గొడ్డలితో తలపై బలంగా మోదాడు. ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కూలిపోయి మృతి చెందింది. స్కూటీని పక్కనే పడవేసి ట్రాలీ బ్యాగ్‌ను దూరంగా విసిరేసి రోడ్డు ప్రమాదం జరిగిందని నమ్మించేలా ప్రయత్నించి ఇంటికి వెళ్లిపోయాడు. ఘటనాస్థలంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన పోలీసులు ఇది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారించి, భర్త రాజును అనుమానించి అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్యపై అనుమానంతోనే హత్యచేశానని రాజు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు రాజును రిమాండ్‌కు తరలించారు.