The heirs are coming! వారసులొస్తున్నారు!
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:35 AM
The heirs are coming! ఎన్నికల నగారా మోగింది.. జిల్లా రాజకీయం హీటెక్కుతోంది. పదవీకాంక్ష... వారసత్వం కొలువుదీరాలన్న ఆరాటం ఉన్న వారంతా తెరపైకి వస్తున్నారు. వారసులను చైర్లో కూర్చోబెట్టాలని తండ్రులు ఉవ్విళ్లూరుతున్నారు.
వారసులొస్తున్నారు!
సొంతముద్ర కోసం తండ్రుల ఆరాటం!
కుమార్తెను చైర్పర్సన్ చేయాలని బొత్స ప్రయత్నం
విభేదించి కుమార్తెతో కలిసి టీడీపీలోకి వెళ్లిన చిన్నశ్రీను
మేయర్ సీటుపై దృష్టి
తన దైన వ్యూహంలో కోలగట్ల
కూతురును మేయర్‌గా చూడాలని ప్రయత్నాలు
సొంత ముద్ర కోసం ఆ ముగ్గురు వనితలు
ఎన్నికల నగారా మోగింది.. జిల్లా రాజకీయం హీటెక్కుతోంది. పదవీకాంక్ష... వారసత్వం కొలువుదీరాలన్న ఆరాటం ఉన్న వారంతా తెరపైకి వస్తున్నారు. వారసులను చైర్లో కూర్చోబెట్టాలని తండ్రులు ఉవ్విళ్లూరుతున్నారు. పదవితో వైభవంగా రాజకీయ ఆరంగేట్రం చేయాలని వారి పిల్లలు ఆశపడుతున్నారు. ఈ క్రమంలో కుమార్తెలదే పైచేయి. ప్రధానంగా నాలుగు కుటుంబాల నుంచి వారసులొస్తున్నారు. నగరపాలక సంస్థ మేయర్.. జడ్పీ చైర్పర్సన్ రేసులో ఉండాలనుకుంటున్నారు. ఇప్పటికే ప్రజాక్షేత్రంలోనూ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ స్థానిక సమరంలో ఎవరు ఏ విధంగా ముందుకెళ్తారో.. ప్రజా మద్దతుతో విజేతలుగా నిలుస్తారో చూడాలి.
విజయనగరం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక సమరానికి వారసులు సై అంటున్నారు. తండ్రుల సహకారంతో ఒక్కో అడుగు వేస్తున్నారు. పుర ఎన్నికలతో పాటు పరిషత్, గ్రామ పోరులోనూ ముందుండాలని ఆరాటపడతున్నారు. ఈ క్రమంలో అనేక కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల నగారా మోగక ముందే జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామం ఇప్పటికీ ప్రకంప నలు సృష్టిస్తోంది. ఇన్నాళ్లూ బొత్స ఫ్యామిలీకి గొడుగుగా.. క్షేత్రస్థాయిలో పార్టీని సమన్వయం చేసే కీలక వ్యక్తిగా పనిచేసిన చిన్నశ్రీను వైసీపీకి గుడ్‌బై చెప్పి మేనమామ బొత్స సత్యనారాయణకు దూరమయ్యారు. పైకి కుటుంబ విభేదాలు లేవని చెబుతున్నప్పటికీ వారసుల రాజకీయ భవిష్యత్ కోసమే ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు అర్థమవుతోంది. ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ తన కుమార్తె డాక్టర్ అనూషను జడ్పీ చైర్‌పర్సన్‌గా పోటీపెడతానని విజయవాడలోని మీడియా చిట్చిట్లో చెప్పారో ఆ తర్వాత ఒక్కసారిగా పరిణామాలు మారాయి. అప్పటికే ఆ పదవిలో తన కుమార్తె సిరి సహస్రను ఊహించుకున్న చిన్న శ్రీను బొత్స ప్రకటనను జీర్ణించుకోలేకపోయారు. అనూహ్యంగా టీడీపీ బాట పట్టారు. కేవలం వారసులకు భవిష్యత్ ఇవ్వాలన్న ఆలోచనతోనే వారి రాజకీయ వైరుధ్యాలు చోటుచేసుకున్నట్టు స్పష్టమవుతోంది.
- బొత్స కుమార్తె డాక్టర్ అనూష కూడా ఒక సవాల్ తీసుకున్నారు. గత ఎన్నికల నుంచి ఆమె రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తున్నారు.
- మొదట నుంచి పూసపాటి అశోక్‌గజపతిరాజుకు ఎదురొడ్డి నిలబడి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలగట్ల వీరభద్రస్వామి రెండు దఫాలు ఎమ్మెల్యేగా అశోక్ గజపతిరాజుపై విజయం సాధించారు. ఇప్పుడు ఆయన తన రాజకీయ వారసురాలిగా కుమార్తె కోలగట్ల శ్రావణి కోసం కృషిచేస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రజా జీవితంలో ఉన్నారు. డిప్యూటీ మేయర్‌గా చేశారు. తాజా నగరపాలక సంస్థ ఎన్నికల్లో శ్రావణిని మేయర్ అభ్యర్థిగా వైసీపీ నుంచి దించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి పటిష్టంగా ఉంది. వైసీపీలో ఉంటే తన కుమార్తె రాజకీయ భవిష్యత్ సెట్ చేయలేననే బెంగ ఆయనలో ఉంది. అందుకే కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరతారన్న ప్రచారమూ ఉంది.
మేయర్ రేసులో సిరిసహస్ర
చిన్నశ్రీను కుమార్తె సిరిసహస్ర పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. విజయనగరం నగర పాలక సంస్థ మేయర్‌గా రేసులో ఉన్నట్లు ఇంచుమించుగా అమె పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయనగరంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. సిరి సహస్రకు తండ్రి చిన్న శ్రీనుకు ఉన్న క్షేత్రస్థాయి బలం, ఆపై రాజకీయం వ్యూహం, అందునా టీడీపీలో చేరడం అదనపు బలం. ఇప్పటికే ఆమె సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందారు.
ఫ 2024లో నెల్లిమర్ల ఎమ్మెల్యే టిక్క్ట్ ఆశించి భంగపడ్డ టీడీపీ నేత కర్రోతు బంగార్రాజు కూడా తన కుమార్తె చంద్రకళకు జడ్పీ చైర్మన్ టికెట్ ఇప్పించుకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
------------------