Share News

Tribal Pregnant Women! గిరిజన గర్భిణులకు ఎంత కష్టం!

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:56 PM

The Hardships Faced by Tribal Pregnant Women! సీతంపేట ఏజెన్సీలో గిరిజన గర్భిణులకు అంతంతమాత్రంగానే వైద్యసేవలు అందుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. ప్రధానంగా నిరక్షరాస్యత, అవగాహన లోపంతో గిరిజన గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు.

 Tribal Pregnant Women! గిరిజన గర్భిణులకు  ఎంత కష్టం!
సీతంపేట వైటీసీలో గిరిజన గర్భిణుల వసతిగృహం

  • అవగాహన లోపంతో ఇక్కట్లు

  • క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

  • వసతిగృహాల్లో తగ్గుతున్న గర్భిణుల సంఖ్య

  • 108 వాహనాల్లోనే ప్రసవాలు.. కొన్నిచోట్ల మాతాశిశు మరణాలు

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో గిరిజన గర్భిణులకు అంతంతమాత్రంగానే వైద్యసేవలు అందుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కూడా పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. ప్రధానంగా నిరక్షరాస్యత, అవగాహన లోపంతో గిరిజన గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. గర్భం దాల్చిన సమయాన్ని గుర్తించుకోకపోవడం, బలవర్థక ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోకపోవడం, రక్తహీనత వంటి కారణాలతో నానా అవస్థలు పడుతున్నారు. వాస్తవంగా గిరిజన మహిళలు గర్భం దాల్చిన నుంచి ప్రతినెలా సమీపంలో ఉన్న పీహెచ్‌సీలకు వైద్య సిబ్బంది తీసుకెళ్లాల్సి ఉంది. కానీ ఏజెన్సీలో పర్యవేక్షణ లోపం కారణంగా గిరిజన గర్భిణులకు సకాలంలో వైద్యపరీక్షలు అందడం లేదు. దీంతో పురిటి నొప్పులు వచ్చే వరకు వారు ఇళ్ల వద్దే ఉండాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో 108 వాహనాల్లోనే ప్రసవిస్తున్న సంఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మూఢనమ్మకాల కారణంగా గిరిజన గర్భిణులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాగా గత ఏడాది నుంచిమార్చి వరకు సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పీహెచ్‌సీల్లో మాతా శిశు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వసతిగృహం వెలవెల

కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే గిరిజన గర్భిణుల కోసం సీతంపేట వైటీసీలో 16 బెడ్‌లతో వసతిగృహాన్ని ఏర్పాటు చేసింది. మొదట్లో ఇక్కడ పూర్తిస్థాయిలో సేవలందించారు. అయితే కొద్దికాలం కిందట నుంచి ఈ వసతిగృహంలో గిరిజన గర్భిణుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అవగాహన లోపంతో ఇక్కడకు ఎవరూ రావడం లేదు. మొత్తంగా వసతిగృహంలో ఎనిమిది బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి.

డిప్యూటీ డీఎంహెచ్‌వో ఏమన్నారంటే..

‘సీతంపేట ఏజెన్సీలో ఇటీవల కాలంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టాయి. గర్భిణులకు పూర్తిస్థాయిలో వైద్యపరీక్షలు, సేవలు అందిస్తున్నాం. గర్భిణుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఏఎన్‌ఎం, ఆశాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం.’ అని డీఎంహెచ్‌వో విజయపార్వతి తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 11:56 PM