Vajpayee మహనీయుడు వాజపేయి
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:31 AM
The Great Leader Vajpayee దేశ రూపురేఖలు మార్చిన మహనీయుడు మాజీ ప్రధాని వాజపేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శుక్రవారం పార్వతీపురంలో వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పార్వతీపురంలో విగ్రహావిష్కరణ
పార్వతీపురం/ బెలగాం, జనవరి 9(ఆంధ్రజ్యోతి) : దేశ రూపురేఖలు మార్చిన మహనీయుడు మాజీ ప్రధాని వాజపేయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శుక్రవారం పార్వతీపురంలో వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బీహారీ వాజిపేయి అజాత శత్రువు. మొత్తంగా పదిసార్లు లోక్ సభకు ఎన్నికై .. కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గవర్నర్ రాంలాల్ అన్యాయంగా టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్, వాజ్‌పేయి కలిసి ఎమ్మెల్యేలను గవర్నర్ వద్దకు తీసుకెళ్లి నిలదీశారు. తిరిగి నెల రోజల్లో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంలో వాజపేయి కీలకంగా వ్యవహరించారు. ఆయన కృషితో దేశంలో తిరుగులేని జాతీయపార్టీగా బీజేపీ అవతరించింది. ప్రధానిగా మోదీ ముచ్చటగా మూడోసారి కొనసాగుతున్నారు. బీజేపీతో సీఎం చంద్రబాబుకు మంచి అనుబంధం ఉంది. 7 లక్షల 50 వేల గ్రామాలకు రహదారులు, సర్వశిక్ష అభియాన్ , గ్యాస్ కనెక్షన్ తదితర ప్రజోపకార పథకాలు అందించిన ఘనత వాజపేయికి దక్కుతుంది. ’ అని తెలిపారు.
అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ.. ‘నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఎన్టీఆర్, వాజపేయి ఎంతో కీలకంగా వ్యవహరిం చారు. ప్రతిపక్ష నేతలను కూడా వాజపేయి ఎంతో గౌరవించేవారు. రాష్ట్రాలు, రాజధానులకు కనెక్టవిటీని ఏర్పాటు చేసి.. అభివృద్ధికి బాటలు వేశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తిరుగులేదు. ’ అని తెలిపారు. వాజపేయి రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలను ఎప్పటికీ మరువలేమని ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ తెలిపారు. అంతకముందు ఎమ్మెల్యే విజయచంద్ర క్యాంప్ కార్యాలయం నుంచి నవిరి వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వేణుగోపాల్, ప్రసాద్ , జిల్లా అధ్యక్షుడు డి. శ్రీనివాసరావు, టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి.రామకృష్ణ, పాలకొండ టీడీపీ ఇన్‌చార్జి భూదేవి తదితరులు పాల్గొన్నారు.