భూగర్భ జలాల పెంపే లక్ష్యం
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:30 PM
జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జలధార-జలహారతి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఏపీఎస్‌ఏసీ) జియో సైన్స్‌స్ విభాగాధిపతి మరియరాజు తెలిపారు.
- కార్యాచరణపై కలెక్టర్‌తో చర్చించిన జియో సైన్స్‌స్ హెడ్
విజయనగరం కలెక్టరేట్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా జలధార-జలహారతి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఏపీఎస్‌ఏసీ) జియో సైన్స్‌స్ విభాగాధిపతి మరియరాజు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ రామసుందర్ రెడ్డిని శనివారం కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సవివరంగా చర్చించారు. ట్యాంకుల ప్రస్తుత స్ధితి, కొత్తగా ఏర్పాటు చేయాల్సిన చెక్‌డ్యామ్‌లు, నీటి వనరుల అభివృద్ధి చర్యలపై ఏపీఎస్‌ఏసీ అందిస్తున్న సాంకేతిక సహకారంపై కలెక్టర్‌కు వివరించారు. ఉపగ్రహ చిత్రాలు, జీఐఎస్ ఆధారిత మ్యాప్ ద్వారా గ్రామ, మండల స్థాయిలో చేపట్టాల్సిన పనులను ఖచ్చితంగా గుర్తించి సంబంధిత శాఖలకు అందిస్తామన్నారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు పర్యటిస్తూ ఇరిగేషన్, డ్వామా శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెరుగుదలకు ఈ కార్యక్రమం ఎంతో కీలకమని తెలిపారు. ఏపీఎస్‌ఏసీ అందిస్తున్న సాంకేతిక సహకారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని, శాఖల సమన్వయంతో లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.