Share News

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - May 08 , 2026 | 12:45 AM

భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రెవెన్యూ సేవల్లో పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
రైతులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

- జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి

పార్వతీపురం/రూరల్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, రెవెన్యూ సేవల్లో పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని గోపాలపురంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న ఒక నెల, ఒక గ్రామం, నాలుగు సందర్శనలు కార్యక్రమంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రెవెన్యూ అధికారులు ప్రతి నెలా నిర్ణీత గ్రామాన్ని నాలుగుసార్లు సందర్శిస్తారని జేసీ తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై వినతులను ప్రత్యక్షంగా స్వీకరిస్తారన్నారు. వెబ్‌ల్యాండ్‌లో తప్పుల సవరణ, సర్వే నెంబర్లు సమస్యలు, సదాబైనమా క్లయిమ్‌లు, ఖాతా మార్పిడి వేగవంతం చేయడం, కుటుంబ భూ వివాదాలు, భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని తెలిపారు. పెండింగ్‌ సమస్యలను తగ్గించి ప్రజల సంతృప్తిని పెంచడమే ఈ కార్య క్రమం లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, ఇతరశాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

అల్లూరికి నివాళి

బ్రిటిష్‌ పాలనపై పోరాటం చేసి అతి చిన్న వయస్సులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు జీవితం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపుతుందని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అల్లూరి వర్ధంతిని నిర్వహించారు. . అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి జేసీ నివాళులర్పించారు. సీతారామరాజు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎ.విజయశాంతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2026 | 12:45 AM