Share News

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం

ABN , Publish Date - Jan 27 , 2026 | 11:48 PM

జిల్లాలో భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి అన్నారు.

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

- తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించాలి

- కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో విజయనగరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అత్యంత పారదర్శకంగా, తప్పులు లేని రెవెన్యూ రికార్డులను రూపొందించాలని సూచించారు. రీ సర్వే పూర్తయిన భూములకు సంబంధించి రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసి, అర్హులైన రైతులందరికీ, కచ్చితమైన వివరాలతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఇప్పటికే రీ సర్వే పూర్తయిన 423 గ్రామాల్లో సుమారు 2,03,000 పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. వ్యక్తిగతంగా భూముల వివరాలను పరిశీలించి, సంబంధిత రైతులతో మాట్లాడి ఈకేవైసీ చేయాలన్నారు. ప్రతి నెల 2 నుంచి 9వ తేదీ వరకూ పంపిణీ చేపట్టాలన్నారు. ఈ విధంగా నెలవారీగా లక్ష్యాలను కేటాయిస్తామన్నారు. నెలకు 12 గ్రామాల్లో 7,993 ఖాతాలను పరిశీలించాల్సి ఉందన్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలలకు 14 గ్రామాల చొప్పున ఎంపిక చేసినట్లు చెప్పారు. రెవెన్యూ క్లినిక్‌లకు పదేపదే అదే వినతులు వస్తున్నాయని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతుందని, దీనిపై దృష్టి సారించాలని అన్నారు. జేసీ సేతు మాధవన్‌ మాట్లాడుతూ.. ప్రసుత్తం ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల్లో కనీసం 50 శాతం తప్పులు ఉన్నాయన్నారు. ముందుగా డ్రాఫ్ట్‌ నోటిపికేషన్‌ ఇచ్చి, తప్పులను సరిదిద్ది కచ్చితమైన పాస్‌పుస్తకాలు రూపొందించాలని ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్‌లకు 400 అర్జీలు వచ్చాయని చెప్పారు. వీటిని వారం నుంచి పది రోజుల్లోగా పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌వో మురళి, ఆర్డీవో కీర్తి, సర్వే శాఖ ఏడీ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 11:48 PM