విద్యార్థులకు వసతుల కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:48 PM
విద్యా ర్థుల చదువు, వారి సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
సాలూరు, జనవరి11(ఆంధ్రజ్యోతి): విద్యా ర్థుల చదువు, వారి సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆదివారం పట్టణంలో రామాకాలనీలో ఎంఈవో కార్యాలయం నిర్మాణానికి ఆమె భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యా విధానంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. అన్ని నియోజక వర్గాల్లో ఎంఈవో కార్యాలయాలను మంజూరు చేశారన్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక నూతన సంస్కరణలు అమలులోకి తీసుకువచ్చార న్నారు. ఫఅనంతరం పట్టణంలో సుమారు రూ.2 కోట్లతో నిర్మించిన 26వ వార్డు వెంకటేశ్వర కాలనీ, బంగారమ్మపేట, నాయుడువీధి, గూడెపువీధి, బంగారమ్మకాలనీల్లో పైలట్ వాటర్ స్కీంలను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంలో పైలట్ వాటర్ స్కీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. అందుకే మహిళల సంక్షేమం కోసం పెద్దమొత్తంలో నిధులను వెచ్చిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, బోను గంగరాజు, పెద్దింటి శ్రీరాములు, కౌన్సిలర్లు హర్షవర్ధన్, వైదేహితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.