Share News

విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడమే లక్ష్యం

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:26 AM

విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి భరోసా కల్పించే విధంగా పింఛన్‌ మొత్తాన్ని పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడమే లక్ష్యం
మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌

మంత్రి కొండపల్లి

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, వారికి భరోసా కల్పించే విధంగా పింఛన్‌ మొత్తాన్ని పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియం వద్ద జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు మోటరైజ్డ్‌ త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులు సమాజంలో గౌరవంగా జీవిస్తూ, తమ కుటుంబాన్ని తామే ముందుండి నడిపించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. వారు ఇతరులుపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మోటరైజ్డ్‌ త్రిచక్ర వాహనాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ వాహనాలు అందజేస్తామని తెలిపారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు చైర్మన్‌ గడుపుడి నారాయణస్వామి మాట్లాడుతూ.. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అనేక ప్రయోజనాలను కల్పిస్తోందని అన్నారు. కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, జేసీ సేతుమాధవన్‌, డీఆర్వో చందక సత్తిబాబు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛతను జీవన విధానంగా మార్చుకోవాలి

స్వచ్ఛత , పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యర్ధాల నిర్వహణ, ప్రజలు జీవన విధానంగా మార్చుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో స్వచ్ఛతా సేవలో గుర్తింపు పొందిన కార్యాలయాలు, అధికారులు, సిబ్బందికి సంబంధించి జిల్లాస్థాయిలో 68 అవార్డులను మంత్రి ప్రదానం చేశారు. ముందుగా మహ్మాతాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించారు. రోడ్లు, భవనాలు, డ్యామ్‌లు వంటి మౌలిక వసతులతో పాటు ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, భావితరాలకు కాలుష్యం లేని వాతావరణం అందించడం ముఖ్యమని తెలిపారు.

తుఫాన్‌ బాధితుల కోసం ఇన్పోసిస్‌ ఫౌండేషన్‌(విశాఖపట్నం) సహకారంతో సత్యసాయి దివ్యమృతం ఆధ్వర్యంలో రూ.15 లక్షల విలువైన వంట సామాగ్రి కిట్లు, నెలకు సరిపడా బియ్యం సమకూర్చారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 1500 బాధిత కుటుంబాలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ కిట్లతో కూడిన వాహనాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు.

Updated Date - Oct 03 , 2026 | 12:26 AM