‘న్యాయం చేరువ చేయడమే ధ్యేయం’
ABN , Publish Date - May 28 , 2026 | 01:01 AM
ఖైదీలకు న్యాయం చేరువ చేయడమే ధ్యేయమని రెండో జిల్లా అదనపు న్యాయాధికారి, మండల న్యాయసేవా అధికారి సంస్థ అధ్యక్షురాలు ఎం.మాధురి తెలిపారు.
పార్వతీపురంటౌన్, మే 27 (ఆంధ్ర జ్యోతి): ఖైదీలకు న్యాయం చేరువ చేయడమే ధ్యేయమని రెండో జిల్లా అదనపు న్యాయాధికారి, మండల న్యాయసేవా అధికారి సంస్థ అధ్యక్షురాలు ఎం.మాధురి తెలిపారు. బుధవారం పార్వతీపురం సబ్‌జైలులో ఏర్పాటుచేసిన న్యాయ సేవా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జైలులో ఉన్న ముద్దాయిలకు సకాలంలో ఉచిత న్యాయ సహయాన్ని అందించి, వారి హక్కులపై అవగాహన కల్పించడం ప్రతి న్యాయ సేవా సంస్థ బాధ్యత అని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు, బంధువులకు అవసరమైన న్యాయ సేవలు, ప్రభుత్వ పథకాలపై మార్గనిర్ధేశం చేసేందుకు ప్రత్యేకంగా సేవా శిబిరాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ శిబిరంలో ప్యానల్ న్యాయవాది, పారా లీగల్ వలంటీర్ల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సబ్ జైల్‌ను సందర్శించిన ఆమె ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జైల్ సూపరింటెండెంట్ జి.రాము, ప్యానల్ న్యాయవాది టి.జోగారావు, పారా లీగల్ వలంటీర్ బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.