‘పది’లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:30 PM
పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం కావాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వసతిగృహ సంక్షేమాధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం కావాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి వసతిగృహ సంక్షేమాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమశాఖల అధికారులు, పోస్టుమె ట్రిక్ వసతిగృహాల వార్డెన్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతిగృహ విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వారి విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముస్తాబు కార్యక్రమానికి సంబంధించి ప్రతి స్కూల్, వసతిగృహాల్లో రోజువారి పురోగతిని వీడియోలు, రీల్స్‌గా తీయాలని సూచించారు. హాస్టళ్ల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జిల్లాలోని 11 హాస్టళ్లకు సాధారణ మరమ్మతుల కోసం బీసీ సంక్షేమశాఖ నుంచి రూ.20.80 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ను వసతి సంక్షేమాధికారులు, వార్డెన్లు సన్మానించారు.
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి..
కొమరాడ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని విక్రంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను ఆయన పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారి విద్యా ప్రమాణాలను పరీక్షించేందుకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చాలన్నారు. గత మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో ఉందని, ఈ ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహ్లాదకర వాతావరణం కనిపించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందేలా చూడాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలో సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, మండల విద్యాశాఖాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.