Share News

గుంతలు లేని రోడ్లే లక్ష్యం

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:47 AM

రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

 గుంతలు లేని రోడ్లే లక్ష్యం
మాట్లాడుతున్న రహదారులు భవనాల శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి

- రాష్ట్ర వ్యాప్తంగా రూ.7వేల కోట్లతో నిర్మాణం

- రహదారులు భవనాల శాఖ మంత్రి జనార్దన్‌రెడ్డి

- సువర్ణముఖి వంతెన, మక్కువ రోడ్డు ప్రారంభం

సీతానగరం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పార్వతీపురం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. సీతానగరం వద్ద సువర్ణముఖి నదిపై రూ.12 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అనంతరం రూ.42 కోట్లతో నిర్మించిన అజ్జాడ-మక్కువ రహదారిని, హనుమాన్‌ జంక్షన్‌లో నూతనంగా నిర్మించిన బస్‌ షెల్టర్‌ను, బలిజిపేట మండలంలో పణుకువలస నుంచి నారాయణపురం వెళ్లే బీటీ రహదారిని ప్రారంభించారు. మిర్తివలస నుంచి అరసాడ బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రహదారులను తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు నరకయాతన అనుభవించారన్నారు. అందుకే రోడ్ల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రూ.7వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 27 వేల కిలో మీటర్ల మేర రహదారి పనులను వేగవంతం చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రానున్న ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా బీటీ రహదారులకు సంబంధించి పాత బకాయిలు చెల్లించి కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రోడ్లకు నిధులు మంజూరు చేసి మంత్రి తన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి, సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు ఎం.తేజోవతి, ఆర్‌అండ్‌బీ అధికారులు, టీడీపీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:47 AM