గంజాయి లేని సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:03 AM
గంజాయి లేని సమాజమే లక్ష్యమని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టీ అన్నారు.
- విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టీ
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): గంజాయి లేని సమాజమే లక్ష్యమని, ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టీ అన్నారు. బుధవారం విశాఖ రేంజ్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో సాగిన గంజాయి వ్యతిరేక పోరాట వివరాలను ఆయన వెల్లడించారు. ‘గత 20 నెలల్లో గంజాయి స్మగ్లర్లపై మెరుపుదాడులు చేశాం. 976 కేసులు నమోదు చేసి 2,405 మందిని అరెస్టు చేశాం. 55,346.292 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 685 వాహనాలు సీజ్ చేసి 24 అంతరాష్ట్ర ముఠాలను గుర్తించాం. 129 మంది సభ్యులపై నిరంతర నిఘా ఉంచాం. 33 అత్యాఽధునిక డ్రోన్‌ల ద్వారా 129 హట్‌స్పాట్‌లపై 1,360 సార్లు నిఘా పెట్టి, నిందితులను అక్కడికక్కడే అరెస్టు చేశాం. పిట్‌ఎన్‌డీపీఎస్ ( కఠిన చట్టాల ప్రయోగం) సాంకేతిక నిఘాతో 1,599 మందిపై హిస్టరీ షీట్లు తెరిచాం. యువత తమ బంగారు భవిష్యత్తును మత్తుకి బలిచేయవద్దు.’ అని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు మోహన్, విష్ణుస్వరూప్, శ్రావణి, శ్రీనివాసరావు, బి.మోహనరావు, ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జునరావు, బాల సూర్యారావు పాల్గొన్నారు.