ఉత్తరాంధ్ర భవిత
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:49 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు.
- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
- ప్రధాని ప్రకటనతో అంతటా చర్చ
- వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల రవాణాకు అవకాశం
- ఏర్పాటుకానున్న ఐటీ అనుబంధ పరిశ్రమలు, డేటా సెంటర్లు
- పెరగనున్న పర్యాటకుల తాకిడి
- జిల్లా ప్రజల్లో ఆనందం
విజయనగరం, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేడుకలా జరిపింది ఈ కార్యక్రమాన్ని. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి మూడున్నర లక్షల మంది తరలివచ్చారని ఒక అంచనా. అయితే విమానాశ్రయ ప్రారంభోత్సవం తరువాత ఉత్తరాంధ్రతో పాటు జిల్లాలో ఒక రకమైన అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పటివరకూ విమానాశ్రయం అంటే కేవలం ఒక రవాణా కేంద్రమని అంతా భావించారు. కానీ, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే ఈ విమానాశ్రయం ద్వారా కలిగే ప్రయోజనాలు, భవిష్యత్ లాభాలు గురించి చెప్పేసరికి ప్రజల్లో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమవుతోంది.
అప్పట్లో అప నమ్మకం..
వాస్తవానికి విభజన హామీల్లో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించేసరికి.. ఇక్కడేంటి? ఎయిర్‌పోర్టు ఏంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సాధారణ ప్రజల్లో కూడా ఒక రకమైన అప నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అన్ని కష్టాలు, ఇబ్బందులను అధిగమించి భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విమానాశ్రయం ప్రాముఖ్యత, భవిష్యత్‌లో చూపబోయే ప్రభావం వంటివి తెలుస్తుండడం నిజంగా ప్రజల్లో ఆనందం నింపుతోంది. ఇటువంటి ప్రాజెక్టు ఉమ్మడి 13 జిల్లాల్లో విజయనగరం జిల్లాకు అవకాశం దక్కడంపై జిల్లా ప్రజలు ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సగటు మనిషి భవిత..
సాధారణంగా విమానాశ్రయం అంటే ఉన్నతశ్రేణి వర్గాలకు చెందినదిగా అంతా భావిస్తారు. కానీ ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో సగటు మనిషి భవిత ఉందని తెలుస్తుండడం మాత్రం ఆసక్తి రేపుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో 169 ప్రాజెక్టులకు శ్రీకారంచుట్టామని.. ఇక్కడ ఐటీ, పర్యాటక, రవాణా, మౌలిక రంగాల్లో ఈ విమానాశ్రయం విప్లవాత్మకమైన మార్పులు ఖాయమని చెప్పారు. వాస్తవానికి ఉత్తరాంధ్రకు అపార వనరులు ఉన్నాయి. సువిశాలమైన తీరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే అందులో సింహభాగం ఉత్తరాంధ్రదే. దాదాపు 400 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇప్పటివరకూ సముద్ర ఉత్పత్తులు అన్ని సాగర మార్గంలో అంటే విశాఖ పోర్టు ద్వారా ఎగుమతి అయ్యేవి. కానీ ఇక నుంచి భోగాపురం విమానాశ్రయంలోని కార్గో విభాగం ద్వారా వెళ్లనున్నాయి. వ్యవసాయ, అటవీ ఉత్పత్తులు సైతం రవాణా జరగనుంది. ఉత్తరాంధ్రలో సువిశాల అటవీ ప్రాంతం ఉంది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతం ఉన్న జిల్లాలు కూడా ఇవే. అందుకే ఇక్కడ ఐటీడీఏలు ఏర్పడ్డాయి. ఒకటి కాదు..రెండు కాదు వందలాది అటవీ ఉత్పత్తులు లభిస్తాయి. ప్రధాన పంటల జాబితా కూడా అధికమే. ఉద్దానం జీడి, మామిడి, మైదాన ప్రాంతాల్లో పండే వరి, చెరకు, మొక్కజొన్న, ఆరుతడి పంటలు అన్నీ ఇక్కడే లభిస్తాయి. విరివిగా పండుతాయి. వీటన్నింటికీ చక్కటి రవాణా మార్గం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో విభాగం.
అన్నింటికీ దిక్సూచి..
ఒక పరిశ్రమ రావాలంటే మౌలిక వసతులు ముఖ్యం. చుట్టూ ఉన్న సౌకర్యాలు ప్రధానం. ప్రధానంగా గ్లోబల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారాలంటే ముందు అంతర్జాతీయ అనుసంధానం, కనెక్టివిటీ అవసరం. అందుకు ప్రధాన మార్గం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిలవనుంది. ఎందుకంటే ఐటీ అనుబంధ పరిశ్రమలు, డేటా సెంటర్లు అన్ని విశాఖ, విజయనగరం సరిహద్దు ప్రాంతాల్లోనే ఏర్పాటుకానున్నాయి. దానికి కారణం ముమ్మాటికీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయమే. అలా ప్రపంచాన్ని ఉత్తరాంధ్రకు పరిచయం చేసేది ఇదే. మరోవైపు ఉత్తరాంధ్ర పర్యాటక ప్రాంతం. టెంపుల్ టూరిజానికి పెట్టింది పేరు. సింహాచలం పుణ్యక్షేత్రం. పైడితల్లి అమ్మవారి ఆలయం, దక్షిణభారత దేశంలో ఏకైన సూర్యదేవాలయం అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రామానారాయణం, రామతీర్థాలు..ఇలా చాలా ఉన్నాయి. వీటన్నింటికీ విదేశీ,ఇతర రాష్ట్రాల పర్యాటకుల తాకిడి పెరగనుంది. ఇప్పుడు దీనిపైనే అంతటా చర్చ నడుస్తోంది. విమానాశ్రయ ప్రారంభోత్సవం తరువాతనే విస్తృత చర్చ జరుగుతుండడం విశేషం.