Share News

గాలుల బీభత్సం

ABN , Publish Date - May 22 , 2026 | 11:36 PM

జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.

గాలుల బీభత్సం
విజయనగరంలో కురుస్తున్న వర్షం

- ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

- పలుచోట్ల పిడుగులు

- నేలకూలిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

- పంటలకు తీవ్ర నష్టం

- ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం

విజయనగరం/రాజాం రూరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి సుమారు గంటసేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో మామిడి, జీడి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటలకు నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్‌కు అంతరాయం కలిగింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ ఎగిరిపడ్డాయి. తెర్లాం ఆసుపత్రి సమీపంలో 33కేవీ లైన్‌పై చెట్టు విరిగిపడటంతో స్తంభం నేలకొరిగింది. మెంటాడ మండలం జీటీపేటలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో మంటలు రేగాయి. దీంతో జనాలు పరుగులు తీశారు. రాజాం మెయిన్‌రోడ్‌లో పలు హోర్డింగ్‌లు నేలకూలడంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. బొబ్బిలిలో కురిసిన భారీ వర్షానికి పారాది వంతెన వద్ద ట్రాఫిక్‌జాం అయింది. వంతెనకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గంట్యాడ, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, గుర్ల, రామభద్రపురం, దత్తిరాజేరు, బాడంగి, బొండపల్లి, మెరకముడిదాం తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రబీ పంటకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

చల్లబడిన జిల్లా

గతవారం రోజులుగా ఎండలతో మండిపోతున్న జిల్లా శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షంతో చల్లబడింది. జిల్లాలోని పలు ప్రధాన పట్టణాల్లో గత వారం రోజులుగా 40 నుంచి 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేడిగాలులు, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోయారు. చిన్నారులు, వృద్ధులు బాధలు వర్ణణాతీతం. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వచ్చేందుకు సాహసించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో శుక్రవారం కురిసిన వర్షంతో ప్రజలు ఉక్కబోత నుంచి ఉపశమనం పొందారు.

Updated Date - May 22 , 2026 | 11:36 PM