Share News

The flag of Vizianagaram's glory flies high on the international stage. అంతర్జాతీయ వేదికపై విజయనగరం కీర్తి పతాకం

ABN , Publish Date - Jul 29 , 2026 | 12:33 AM

The flag of Vizianagaram's glory flies high on the international stage. స్కాట్లాండ్‌ దేశంలోని గ్లాస్కో పట్టణంలో జరుగుతున్న కామన్వెల్త్‌ దేశాల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్‌బాబు అద్భుత విజయం సాధించారు.

The flag of Vizianagaram's glory flies high on the international stage. అంతర్జాతీయ వేదికపై   విజయనగరం కీర్తి పతాకం
గ్లాస్కో క్రీడల్లో వెయిట్‌ ఎత్తుతున్న అజయ్‌బాబు

అంతర్జాతీయ వేదికపై

విజయనగరం కీర్తి పతాకం

కామన్వెల్త్‌ దేశాల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తా చాటిన అజయ్‌బాబు

రజత పతకం కైవసం

కొండవెలగాడలో సంబరాలు

నాడు తండ్రికి కాంస్యం.. నేడు కొడుకుకు రజతం

అజయ్‌బాబును అభినందించిన మంత్రి కొండపల్లి

నెల్లిమర్ల, జూలై 28(ఆంధ్రజ్యోతి): స్కాట్లాండ్‌ దేశంలోని గ్లాస్కో పట్టణంలో జరుగుతున్న కామన్వెల్త్‌ దేశాల వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్‌బాబు అద్భుత విజయం సాధించారు. రజత పతకం గెలిచి దేశకీర్తి ప్రతిష్టలను రెపరెపలాడించారు. విజయనగరం జిల్లా పేరును చాటారు. 79 కిలోల కేటగిరిలో పాల్గొన్న అజయ్‌బాబు స్నాచ్‌లో 149 కిలోల బరువు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 181 కిలోల బరువు కలిపి మొత్తం 330 కిలోల బరువుని ఎత్తి శభాష్‌ అనిపించారు. ఈ పోటీల్లో భారతదేశానికి దక్కిన ఆరో పతకమిది. ఈయన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 2010లో కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించి...ప్రస్తుతం నేషనల్‌ కోచ్‌గా సేవలందిస్తున్నారు. తండ్రి స్ఫూర్తితో కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే శిక్షణ ప్రారంభించిన అజయ్‌ కఠోర సాధనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను అందుకున్నాడు. చిన్న గ్రామం నెల్లిమర్ల మండలం కొండవెలగాడ నుంచి ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు ప్రపంచ వేధికపై భారత్‌ తరపున సత్తాచాటాడు. తాజా పోటీల్లో అజయ్‌బాబు విజేతగా నిలవడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి స్ఫూర్తితో..

అజయ్‌బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు ప్రముఖ ఇండియన్‌ వెయిల్‌లిఫ్టర్‌. 1997లో శిక్షణ ప్రారంభించిన ఆయన రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో శ్రీనివాసరావు భారత్‌ తరపున 56 కేజీల విభాగంలో పోటీపడి కాంస్యం సాధించారు. ఇప్పుడు 16 ఏళ్ల తరువాత అదే కుటుంబం నుంచి ఆయన కుమారుడు అజయ్‌ కామన్వెల్త్‌ వేదికపై బరిలోకి దిగి రజతం సాధించాడు. ఇండియన్‌ ఆర్మీలో సిఫాయి స్థాయి నుంచి జేఏఓ కేడర్‌ వరకు ఎదిగిన వల్లూరి శ్రీనివాసరావు రిటైర్‌ అయ్యారు. ప్రస్తుతం స్వగ్రామంలోనే ఉంటూ యువ క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు. తండ్రి స్ఫూర్తితో అజయ్‌బాబు ఎనిమిదేళ్ల వయసు నుంచే వెయిట్‌లిఫ్టింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. కఠోర సాధనతో అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ వచ్చాడు.

- అజయ్‌బాబు 2026లో అహ్మదాబాద్‌లో జరిగిన సీనియర్‌ కామన్వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో సాధించిన ప్రతిభతో అజయ్‌బాబు ఇప్పటికే క్రీడా కోటాలో ఇండియన్‌ ఆర్మీలో జేఏవో కేడర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. క్రీడల్లో రాణించడమే కాకుండా దేశ సేవకు అవకాశం లభించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామం నుంచి నేడు అంతర్జాతీయ వేదిక వరకు వెళ్లిన అజయ్‌బాబు తాజాగా రజతం సాధించడంతో విజయగనరం జిల్లా అసోషియేషన్‌, రాష్ట్ర అసోషియేషన్‌తోపాటు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అభినందించిన మంత్రి కొండపల్లి

కామన్వెల్త్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో రజత పతకం సాధించిన అజయ్‌బాబును మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అభినందించారు. తండ్రి వల్లూరి శ్రీనివాసరావును తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. అజయ్‌బాబుతో వీడియో కాల్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు. జిల్లాకు గొప్ప ఖ్యాతి తీసుకువచ్చిన నీ ప్రతిభను మంత్రి నారా లోకేష్‌కు తెలియజేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు కూడా అజయ్‌బాబును అభినందించారు.

Updated Date - Jul 29 , 2026 | 12:33 AM