తొలి విడత ప్రశాంతంగా ముగిసింది
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:56 AM
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.
ఎస్పీ దామోదర్
విజయనగరం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసినట్టు ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. బొబ్బిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో ఏనిమిది మండలాల్లో ఈ ఎన్నికలు జరిగినట్టు వివరించారు. వీటితో పాటు రాజాం పురపాలక సంఘ ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన కార్యచరణ ప్రణాళికను అమలు చేశామన్నారు. బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లాం, ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవలస, వేపాడ మండలాల్లో 180 పంచాయతీల్లో ఎన్నికలు జరిగినట్టు ఆయన వివరించారు. ఆయా ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి తానే స్వీయ పర్యవేక్షణ చేసినట్టు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత గెలిచిన వారు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా, విజయోత్సవ ర్యాలీలు జరపకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇన్‌స్పెక్టరు, సబ్ ఇన్‌స్పెక్టరు స్థాయి అధికారులను బాధ్యులుగా చేసి నియమించడంతో సత్ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీలు ఎస్.లక్ష్మణమూర్తి, గోవిందరావు, రాఘవులు, కోటిరెడ్డి, సీఐలు లీలారావు, దుర్గాప్రసాద్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కొత్తవలస, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఎంతో ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. గురువారం ఆయన కొత్తవలస మేజర్ పంచాయతీకి సంబంధించి జడ్పీహైస్కూల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా పరిశీలకుడు వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల్లో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. అనంతరం కొత్తవలస పోలీసుస్టేషన్‌కు వెళ్లి నూతనంగా నిర్మిస్తున్న స్టేషన్ పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పాత భవనాల శిథిలాలను తొలగించి, నూతన భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలని సీఐ టీవీ విజయ్‌కుమార్‌కు సూచించారు.