The final day... ఆఖరి రోజు .. అదే జోరు
ABN , Publish Date - Oct 24 , 2026 | 12:18 AM
The final day... with the same momentum పరిషత్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. శుక్రవారం నామినేషన్ల పర్వం పూర్తయింది. జిల్లాలో 15 మండలాల్లో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు చివరిరోజు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు ఊరేగింపుగా శ్రేణులతో తరలివచ్చారు. దీంతో జడ్పీ కార్యాలయంతో పాటు ఎంపీడీవో కార్యా లయాలు కిటకిటలాడాయి.
ముగిసిన స్వీకరణ ప్రక్రియ .. నేడు పరిశీలన
226 ఎంపీటీసీ స్థానాలకు 1267, 15 జడ్పీటీసీ స్థానాలకు 127 మంది దాఖలు
పార్వతీపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): పరిషత్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. శుక్రవారం నామినేషన్ల పర్వం పూర్తయింది. జిల్లాలో 15 మండలాల్లో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు చివరిరోజు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు ఊరేగింపుగా శ్రేణులతో తరలివచ్చారు. దీంతో జడ్పీ కార్యాలయంతో పాటు ఎంపీడీవో కార్యా లయాలు కిటకిటలాడాయి. పార్వతీపురం మండలం నర్సిపురంలో ఉన్న జడ్పీ కార్యాలయంలో సీఈవో సుధాకరరావు ఆధ్వర్యంలో నామినేషన్లను స్వీకరించారు. 15 మండలాలకు చెందిన కూటమి పార్టీల అభ్యర్థులు, వైసీపీ , కాంగ్రెస్, స్వతంత్య్ర అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఇక ఎంపీడీవో కార్యాలయాల్లో ఎన్నికల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో నామినేషన్లను స్వీకరించారు. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియ ముగియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు స్వీకరించిన నామినేషన్లను 24న వాటిని పరిశీలిస్తారు. 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకోవచ్చు. 26న ఎన్నికల అధికారి నామినేషన్ల తిరస్కరణపై తుది నిర్ణయం తీసుకుంటారు. 27న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు.
మన్యం జిల్లాలో 226 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 1267 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 22న 618, 23న 649 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఇక 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 127 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజున 84 వరకు పత్రాలు వచ్చాయి. ఇందులో టీడీపీ నుంచి 43 , వైసీపీ41 , బీజేపీ నాలుగు, జనసేన 23, కాంగ్రెస్ పార్టీ ఐదు , బీఎస్పీ నుంచి మూడు, సీపీఐ నుంచి మూడు , ఇతర పార్టీల నుంచి మరో మూడు నామినేషన్లు ఉన్నాయి. ఇండిపెండెంట్లుగా ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఏదేమైనా పార్టీ అధిష్ఠానాలు బీఫారాలు అందించిన తర్వాత పరిషత్ పోరులో ఉండేదెవరో.. రెబల్ ఎవరో తేలనుంది.