Share News

మొక్కుబడిగా ‘పొలం పిలుస్తోంది’

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:06 AM

జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. 14 శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు తప్ప మిగతా వారు హాజరుకావడం లేదు.

మొక్కుబడిగా ‘పొలం పిలుస్తోంది’
గరుగుబిల్లి మండలం సంతోషపురం పొలంపిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యం(ఫైల్‌)

- ఫొటోలకే పరిమితమవుతున్న అధికారులు

- రైతులకు సలహాలు, సూచనలు అంతంతే

- శాఖల మధ్య సమన్వయ లోపం

పార్వతీపురం, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మొక్కుబడిగా సాగుతోంది. 14 శాఖల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారులు తప్ప మిగతా వారు హాజరుకావడం లేదు. వ్యవసాయ అధికారులు కూడా పొలాలకు వెళ్లి అక్కడ ఉన్న రైతులతో ఫొటోలు తీసుకోవడానికే పరిమితవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతులకు సాగుపై అవగాహన కల్పించడం గానీ, సూచనలు, సలహాలు ఇవ్వడం గానీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ప్రతి సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో 2.62లక్షల ఎకరాల్లో, రబీ సీజన్‌లో 75వేల ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగుచేస్తుంటారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, రాగులు, ఉలవలు, పెసర, మినుము, చెరకు, నువ్వులు, కూరగాయలు వంటివి పండిస్తుంటారు. అయితే, ప్రతి సంవత్సరం వాతావరణ ప్రతికూల పరిస్థితులు, చీడపీడలు, తెగుళ్లతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంటుంది. సరైన సాగు సలహాలు లేక ఏటా రైతులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి 2024 సెప్టెంబరు 10న శ్రీకారం చుట్టింది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ శాఖలైన మత్స్య, ఉద్యాన, పట్టు పరిశ్రమ, సేంద్రియ, మార్కెటింగ్‌ శాఖ అధికారులను పొలంబాట పట్టాలని ఆదేశించింది. వీరంతా రైతులతో సమావేశాలు కావాలి. వారికి సరైన సాగు సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఖరీఫ్‌, రబీలో చెరో నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించింది. ప్రతి మంగళ, బుధవారాల్లో విధిగా నిర్వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అయితే, జిల్లాలో ఈ ఏడాదిన్నరలో అధికారులు కేవలం ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయశాఖతో పాటు దాని అనుబంధ శాఖలు కూడా తప్పనిసరిగా పొలం పిలుస్తోంది కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. కానీ, మార్కెటింగ్‌, మత్స్యశాఖ, పట్టుపరిశ్రమ శాఖ, సేంద్రియ తదితర శాఖల అధికారులు అనేక మండలాల్లో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరుకావడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ఆయా శాఖల ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందడం లేదు.

జిల్లాకు పూర్తిస్థాయి వ్యవసాయాధికారి లేరు. గతంలో పనిచేసిన రాబర్ట్‌పాల్‌ పదోన్నతిపై వెళ్లిపోయారు. దీంతో గత ఏడాది ఇన్‌చార్జి వ్యవసాయశాఖ అధికారిగా అన్నపూర్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈమె ప్రస్తుతం సెలవులో ఉన్నారు. సాలూరు ఏడీ జి.సత్యవతి ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారిగా వ్యవహరిస్తున్నారు

విజయవంతంగా నిర్వహిస్తున్నాం

జిల్లాలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. కొన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరుకావడం లేదు. అయినప్పటికీ వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అన్ని సలహాలు, సూచనలు అందిస్తున్నాం.

- జి.సత్యవతి, జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి

Updated Date - Feb 27 , 2026 | 12:06 AM