Share News

The EV Path ఈవీ బాట

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:24 AM

The EV Path ప్రజలు ఎలక్ర్టిక్‌ వెహికల్స్‌(ఈవీ) బాట పడుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల మోడళ్లలో వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ధరలు అటుఇటుగా ఉన్నా కూడా కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు.

The EV Path ఈవీ బాట

ఈవీ బాట

జిల్లాలోనూ పెరుగుతున్న ఎలక్ర్టిక్‌ వాహనాలు

మార్కెట్‌లోకి కొత్త మోడళ్లు

వివిధ ధరల్లో అందుబాటులోకి..

పర్యావరణానికీ మేలు

పెట్రోల్‌, గ్యాస్‌ వినియోగంతో అనర్ధాలు

ప్రజలు ఎలక్ర్టిక్‌ వెహికల్స్‌(ఈవీ) బాట పడుతున్నారు. వారి అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాల మోడళ్లలో వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ధరలు అటుఇటుగా ఉన్నా కూడా కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. తద్వారా పెట్రోల్‌, డీజిల్‌ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు తాము సైతం అంటున్నారు. చిన్న చిన్న పట్టణాలకు సైతం ఎలక్ర్టిక్‌ వాహనాల షోరూంలు వచ్చేశాయి. డిమాండ్‌ను చూసి పేరుమోసిన కంపెనీలు కూడా వీటిని దించుతున్నాయి.

రాజాం, జూలై 1(ఆంధ్రజ్యోతి):

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ప్రజల్లో కొత్త ఆలోచనకు బీజం పడింది. పెట్రోల్‌, గ్యాస్‌ వినియోగంలో దాదాపు అందరూ పొదుపు పాటిస్తున్నారు. వాహన వినియోగంలోనూ పొదుపు బాట పడుతూ ఎలక్ర్టిక్‌ వాహనాలను విరివిగా వాడుతున్నారు. ప్రభుత్వం సైతం పెట్రోల్‌, గ్యాస్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచిస్తోంది. విద్యుత్‌తో నడిచే సాధనాలు, పరికరాలను ఎంపిక చేసుకోవాలని కోరుతోంది. ముఖ్యంగా వాహన వినియోగంలో ఎలక్ర్టిక్‌ను ప్రోత్సహిస్తోంది. వీటి వాడకంతో ఆర్థికభారంతో పాటు శబ్ధం, వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. వీటిపై అవగాహన పెరుగుతుండడంతో క్రమేపీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి.

అందుబాటులో ఈవీలు

ఎలక్ర్టిక్‌ వాహనాలు కూడా వివిధ మోడళ్లలో, ధరల్లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇంటి వద్దే సులువుగా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. షోరూమ్‌లతో పాటు వివిధ కేంద్రాల్లో చార్జింగ్‌ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకూ స్కూటీలు, బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆటోలు, కార్లు, మోపెడ్‌లు సైతం తక్కువ ధరల్లోనే అందుబాటులోకి తెస్తున్నారు. చివరకు చిరువ్యాపారులు, దివ్యాంగులకు తగ్గట్టు స్కూటీల్లో మార్పులు తెచ్చి అందిస్తున్నారు.

కాలుష్య హెచ్చరికలతో..

జిల్లాలో కాలుష్యం పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. కాలుష్య నియంత్రణలో భాగంగా కేంద్రం హెచ్చరించిన ప్రాంతంలో విజయనగరం కూడా ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి వీటి అగ్రహారం, కస్పా నగరపాలక పాఠశాల, బొబ్బిలి పారిశ్రామికవాడలో కాలుష్య తీవ్రత తెలియజెప్పే పరికరాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి నెలలో 9 రోజుల పాటు మలినాలు, ప్రమాదకర వాయువుల శాతాన్ని లెక్కిస్తారు. కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం పీఎం-10ను కొలుస్తారు. దీని విలువ ఏడాదిలో క్యూబిక్‌ మీటర్‌లో 60 మైక్రోగ్రామ్స్‌కు మించకూడదు. కానీ విజయనగరంలో సరాసరి 70 నుంచి 76 వరకూ నమోదవుతోంది. బొబ్బిలిలో 76.5గా ఉంది. అందుకే కాలుష్యాన్ని నియంత్రించాలంటే ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం పెరగాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సూచిస్తోంది.

అదనపు భారం లేకుండా..

పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాలు కాలుష్యానికి కారకాలుగా నిలుస్తున్నాయి. వీటి నిర్వహణ కూడా ఆర్థిక భారంగా మారుతోంది. వీటికి రవాణా శాఖ అనుమతులు, రెన్యూవల్స్‌ తప్పనిసరి. బీమాతో పాటు వాహనపత్రాలు ఉండాలి. లైసెన్స్‌ కలిగి ఉండాలి. కానీ ఎలక్ర్టిక్‌ వాహనాలకు ఇవేవీ అవసరం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గంటకు 50 కిలోమీటర్లలోపు వెళ్లే ద్విచక్ర వాహనదారుడుకు లైసెన్స్‌, రిజిస్ర్టేషన్‌ అవసరం ఉండదు. 50 కిలోమీటర్ల వేగం దాటితే మాత్రం నిబంధనలు పాటించాల్సిందే. రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి వివరాలు సమర్పించాలి. వేగం ఎంతైనా హెల్మెట్‌ తప్పనిసరి. మూడు, నాలుగు చక్రాల ఎలక్ర్టిక్‌ వాహనాలకు కచ్చితంగా రిజిస్ర్టేషన్‌, లైసెన్స్‌ ఉండాలి. అయితే ఈ ఎలక్ర్టిక్‌ వాహనాల అమ్మకాలు పెంచేందుకుగాను కేంద్ర ప్రభుత్వం అనేక రకాల రాయితీలతో ప్రోత్సహిస్తోంది.

వాహన వినియోగం ఇలా..

ఒక్క ద్విచక్ర వాహనాల్లోనే కాదు. అన్ని రకాల సేవలు, వినియోగానికి సంబంధించి ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ విద్యుత్‌ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు కూడా. ఒక స్కూటీకి 3 నుంచి 4 గంటలు చార్జింగ్‌ పెట్టుకుంటే 50 నుంచి 120 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. ఇందుకుగాను ఖర్చయ్యేది కేవలం 1 నుంచి 3 యూనిట్లు మాత్రమే. ఆటోలకు సంబంధించి 3 నుంచి 9 గంటలు చార్జింగ్‌ పెట్టుకుంటే 100 నుంచి 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 2 నుంచి 4 యూనిట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్‌ బైక్‌కు 4 నుంచి 6 గంటలు చార్జింగ్‌ పెడితే 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణించవచ్చు. 2 నుంచి 4 యూనిట్ల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉంది. వీటి వాడకంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. తక్కువ ఖర్చుతో నడపవచ్చు. కాలుష్యం లేకుండా సమాజాన్ని కాపాడవచ్చు.

ప్రోత్సహించాలి

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల వినియోగంతో కాలుష్యం అధికం. ఆపై పర్యావరణానికి విఘాతం. ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగం పెరగాలి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాలి. ప్రతిఒక్కరూ ఎలక్ర్టిక్‌ వాహనాలనే వినియోగించాలి. అందరూ వినియోగించేలా ప్రోత్సహించాలి.

కె.అశోక్‌కుమార్‌, సీఐ, రాజాం

--------------------

Updated Date - Jul 02 , 2026 | 12:24 AM