The election bell has rung. మోగిన ఎన్నికల నగారా
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:20 AM
The election bell has rung. స్థానిక’ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం పంచాయతీలు, పరిషత్‌లు, మున్సిపాలిటీలు-కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూళ్లను విడుదల చేసింది. ఆ వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.
మోగిన ఎన్నికల నగారా
నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ
తొలుత మున్సి‘పోల్స్’
28న కార్పొరేషన్ ఎన్నికలు
అవసరమైన చోట రీ పోలింగ్ 29నే
ఆపై పరిషత్ ఎన్నికలు.. చివరిగా పంచాయతీ
ఈనెల 18 లేదా 19న పరిషత్ నోటిఫికేషన్
పంచాయతీ ఎన్నికలకు వచ్చే నెలలో జారీ
అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి
‘స్థానిక’ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం పంచాయతీలు, పరిషత్‌లు, మున్సిపాలిటీలు-కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూళ్లను విడుదల చేసింది. ఆ వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో తొలి అంకం మున్సి‘పోల్స్’దే! పురపాలక, నగరపాలక సంస్థ ఎన్నికల షెడ్యూల్‌తోపాటు నోటిఫికేషన్ కూడా బుధవారం విడుదల చేసింది. ఈ తర్వాత జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు ఎన్నికలు జరుగుతాయి. ఆఖరున పంచాయతీ ఎన్నికలుంటాయి. పుర, పరిషత్ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో ముగియనుండగా... గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం మూడు విడతల్లో నిర్వహించనున్నారు. కాగా నగరపాలక సంస్థల మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుంది. ప్రజలే వీరిని ఎన్నుకుంటారు. మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షులను మాత్రం... ఎన్నికల్లో నెగ్గిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్నుకుంటారు.
విజయనగరం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. దీంట్లో భాగంగా విజయనగరం నగరపాలక సంస్థ, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగరపంచాయతీల ఎన్నికలకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 16వ తేదీ నుంచి 18 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. చివరి రోజు మధ్యాహ్నం 3గంటలతో గడువు ముగుస్తుంది. 19వ తేదీ ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. 21వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంటుంది. 28వ తేదీన ఎన్నిక జరగనుంది. కాగా నగరపాలక సంస్థ, 2 మున్సిపాలీటిలకు, 1 నగరపంచాయతీకి రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసిన విషయం తెలిసిందే. మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాలకు కూడా బుధవారం రిజర్వేషన్లు ఖరారయ్యాయి. షెడ్యూల్ కూడా ప్రకటించడంతో జిల్లాలో తక్షణమే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర అధికార యంత్రాంగం జిల్లాలోని 27 మండలాలు, విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటి, నెల్లిమర్ల నగర పంచాయతీ అధికారులను అప్రమత్తం చేసింది. శిక్షణ, అవగాహన కార్యక్రమాలు పూర్తిచేసింది. ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికల నిర్వహణ నుంచి ఫలితాల ప్రకటన వరకూ వివిధ ప్రక్రియలు జరుగుతాయి. విలీన పంచాయతీల వివాదం ఉన్న రాజాంలో రెండోవిడతలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఎన్నికలు ఇలా..
తొలి విడతలో మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. బొబ్బిలి, నెల్లిమర్లలో ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. అవసరమైన చోట 29తేదీన రీ పోలింగ్ నిర్వహించి, 30న ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. విజయనగరం కార్పొరేషన్‌కు 28న పోలింగ్ నిర్వహించాలని అధికారులు ప్రతిపాదించారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఇలా
నవంబరు 3వ తేదీన 27 జడ్పీటీసీ ,449 ఎంపీటీసిలకు ఎన్నికలు జరగనున్నాయి. రీ పోలింగ్ అవసరమైన చోట 4 తేదీన నిర్వహించనున్నారు. 5వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
పంచాయతీల్లో మూడు విడతలు
జిల్లాలో మూడు విడతలుగా 776 గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలివిడత నవంబరు 26, మలివిడత 29, తుది విడత డిసెంబరు 2న ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి అవసరమైన చోట మరుసటి రోజు రీపోలింగ్ ఉంటుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
-------------------------
సిద్ధంగా ఉన్నాం
కమిషనర్ బాలాస్వామి
విజయనగరం టౌన్, అక్టోబరు14(ఆంధ్రజ్యోతి): కార్పొరేషన్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని కమిషనర్ బాలాస్వామి అన్నారు. ఈసీ నోటిఫికేషన్ ప్రకటించిన సందర్భంగా ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే పోలింగ్స్టేషన్ల గుర్తింపు, ఓటర్ల తుది జాబితా విడుదల, ఎన్నికల సిబ్బంది నియామకం, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు కూడా పూర్తయ్యిందన్నారు. వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్నారు. 16,17,18 తేదీలలో నామినేషన్ల స్వీకరణ, 19వ తేదీన పరిశీలన, 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను విడుదల ఉంటుందన్నారు. 28న ఎన్నికలు, 30న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా 2,23,050మంది ఓటర్లు ఉండగా 229 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. 1600మంది సిబ్బంది అవసరం ఉంటుందని, 40మంది రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అప్పటికే నియమించారని తెలిపారు. విలేకరుల సమావేశంలో నోడల్ అధికారి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
=============================
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
కంట్రోల్ రూమ్ ది కీలక పాత్ర
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ఎన్నికల విఽధుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా సమన్వయంతో వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ అనేది అనేక దశలతో కూడిన కీలకమైన ప్రక్రియ అని, ప్రతి దశలోనూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. ఎన్నికలకు విధుల కేటాయింపు , సిబ్బంది నియామకం, శిక్షణ, ఎన్నికల సామగ్రి సమీకరణ, రవాణా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటివాటిని కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. దీని కోసం ఒక చెక్ లిస్టును రూపొందించుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల సిబ్బంది విధుల కేటాయింపు, శిక్షణ, ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలింపు, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, స్ర్టాంగ్ రూమ్‌ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్ సిబ్బంది , సెక్టార్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది మధ్య సమన్వయం ఉండేలా చూడాలన్నారు.
కంట్రోల్ రూమ్ కీలక పాత్ర
ఎన్నికల పర్యవేక్షణలో కంట్రోల్ రూం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. కంట్రోల్ రూం 24 గంటలూ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా విధులు నిర్వహించాలని, సిబ్బంది షిప్టుల వారీగా బాధ్యతలు కేటాయించి సమాచార వ్యవస్ధను సమర్థంగా నిర్వహించాలని చెప్పారు.
- పోలింగ్ రోజున, ముందు రోజు కంట్రోల్ రూమ్ మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రారంభం, పోలింగ్ సిబ్బంది అందుబాటు, పోలింగ్ పరికరాలు, పనితీరు, ఓటర్లకు కల్పించిన సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ శాతం వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
నియమావళిని తక్షణమే అమలు చేయాలి
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రాజకీయ ప్రతినిధులకు సంబంధించిన ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలన్నారు. విగ్రహాలకు ముసుగులు వేయాలని, శిలాఫలకాలపై పేర్లు కన్పించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
---------------